చేర్యాల, జనవరి 10: త్వరలో జరుగనున్న మున్సిపల్ ఎన్నికల్లో యువతదే కీలకపాత్ర అని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా చేర్యాల మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నిమ్మ రాజీవ్‌రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపాలిటీలోని నాలుగో వార్డుకు చెందిన కాంగ్రెస్ యువత శనివారం ఎమ్మెల్యే పల్లా సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి గులాబీ కండువాలు కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ ప్రవేశపెట్టి పథకాలు, అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, రాష్ట్రంలో పాలన సాగిస్తున్న కాంగ్రెస్ చేస్తున్న పనులను పోల్చిచూడాలన్నారు.
బీఆర్ఎస్ పాలనలో చేర్యాల సమగ్రాభివృద్ధి సాధించిందని గుర్తుచేశారు. రూ.8కోట్ల పైచిలుకు నిధులతో ప్రభుత్వ దవాఖానకు నూతన భవనం మంజూరు చేశామని, దీంతో పాటు కాలనీలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించినట్లు తెలిపారు. కేసీఆర్ పాలనలో చేర్యాలకు పూర్వవైభవం తీసుకువచ్చేందుకు ప్రభుత్వ కార్యాలయాల భవన సముదాయం మంజూరు చేస్తే కాంగ్రెస్ పాలనలో నిధులు మంజూరు చేయకపోవడంతో పనులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు.
అమృత్ పథకంలో పెద్ద చెరువుకట్ట సుందరీకరించేందుకు రూ.3.16 కోట్లు మంజూరయ్యాయన్నారు. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో పార్టీ శ్రేణులు ఇంటింటా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్లో చేరిన వారిలో మహ్మద్ తహేర్, నుమాన్, హనీఫ్, పర్వేజ్, ఆధాన్, ఆశ్రఫ్, నితిన్‌కుమార్, సాయికుమార్, అనిల్‌కుమార్, ఆదర్శ్,రఘు, రాజు, నాని, శ్రీనాథ్, కాటంరాజు ఉన్నారు. కార్యక్రమంలో సీనియర్ నాయకుడు అంకుగారి శ్రీధర్‌రెడ్డి, కాశెట్టి బాగయ్య, మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ మంగోలు చంటి, బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గదరాజు చందు, మాజీ ఉపసర్పంచ్ మంచాల కొండయ్య, టౌన్ కార్యదర్శి బూరగోని తిరుపతి, యూత్ అధ్యక్షుడు యాట భిక్షపతి, కాశెట్టి బాగయ్య, బుడిగె శ్రీనివాస్, ఆకుల రాజేశ్‌గౌడ్, అవుశర్ల కిశోర్, అవుశర్ల వెంకట్, పచ్చిమడ్ల బాచి పాల్గొన్నారు.