– కేవీకే కొత్తగూడెం ఆధ్వర్యంలో 150 మంది మహిళా రైతులకు నాణ్యమైన విత్తనాల పంపిణీ
రుద్రంపూర్, జూన్ 06 : కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే), భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో శనివారం వానాకాలం పంటల సాగుపై ముందస్తు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టేకులపల్లి మండలం లక్ష్మిపురం గ్రామ పంచాయతీ పరిధి, అశ్వాపురం మండలం పరిధి నుండి సుమారు 150 మంది రైతులు పాల్గొన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కేవీకే ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ డాక్టర్ టి.భరత్ మాట్లాడుతూ రైతులు తప్పనిసరిగా మట్టి పరీక్షలు చేయించుకుని, వాటి ఫలితాల ఆధారంగా అవసరమైన మేరకే ఎరువులను వినియోగించాలని సూచించారు. పోటీతత్వంతో అధిక మోతాదులో ఎరువులు వాడడం వల్ల భూసారం తగ్గిపోయే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.
ఉద్యాన శాస్త్రవేత్త శివ మాట్లాడుతూ.. రైతుల కోసం కేవీకే ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలు, ఆధునిక సాగు సాంకేతిక పద్ధతుల పరిచయం, శిక్షణా కార్యక్రమాలు, వాతావరణ సమాచారం, పంటల యాజమాన్యం, చీడపీడల నివారణ తదితర అంశాలపై నిరంతరం మార్గదర్శకత్వం అందిస్తున్నట్లు తెలిపారు. రైతులు పంట మార్పిడి విధానాన్ని అవలంబించి ఆయిల్ పామ్, మునగ, పందిరి పద్ధతిలో తీగజాతి కూరగాయల సాగు చేపట్టడం ద్వారా స్థిరమైన ఆదాయం పొందవచ్చని సూచించారు. అనంతరం కేవీకే ప్రాంగణంలో నిర్వహిస్తున్న “ఖేతి బచావో అభియాన్” కార్యక్రమంలో భాగంగా మట్టి నమూనాల సేకరణ విధానాన్ని రైతులకు ప్రదర్శించారు. అలాగే గిరిజన ఉప ప్రణాళిక పథకం కింద 150 మంది మహిళా రైతులకు వరి నాణ్యమైన వంగడం రకం కేఎన్ఎం–1638 విత్తనాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కేవీకే శాస్త్రవేత్తలు, సిబ్బంది, వ్యవసాయ అధికారులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

వానాకాలం పంటలపై రైతులకు ముందస్తు అవగాహన