గుమ్మడిదల, జూలై 14: మున్సిపాలిటీల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.15 కోట్ల నిధులతో చేపట్టాల్సిన పనులు ఇప్పటికీ ప్రారంభం కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. రెండు నెలల క్రితం శంకుస్థాపన జరిగి, టెండర్ ప్రక్రియ పూర్తయినా పనులు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపాలిటీతో పాటు పటాన్చెరు నియోజకవర్గంలోని మున్సిపాలిటీల్లో జిమ్, పార్కు లు, క్రీడామైదానం, చెరువుల సుందరీకరణ, యూజీడీ, సీసీ రోడ్లు తదితర నగరాభివృద్ధి పనులకు రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ శంకుస్థాపనలు చేశారు.
అనంతరం టెండర్లు పూర్తి చేసి కాంట్రాక్టర్లకు అప్పగించినా పనులు మాత్రం ప్రారంభం కాలేదు. గతంలో చేసిన పనుల బిల్లులే ఇంకా పెండింగ్లో ఉన్నాయని, కొత్త పనులు చేపట్టేందుకు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. పనులు చేసినా నెలల తరబడి బిల్లులు రాక అప్పులు, వడ్డీల భారం పెరుగుతోందని కాంట్రాక్టర్లు వాపోతున్నారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపనలే తప్ప ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైందని స్థానికులు విమర్శిస్తున్నారు. గుమ్మడిదలలో రూ.15 కోట్లతో అభివృద్ధి పనులు వేగం కావాలంటే నిధుల విడుదలపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చి, కాంట్రాక్టర్లకు చెల్లింపుల హామీ కల్పించాలని ప్రజాప్రతినిధులు, ప్రజలు కోరుతున్నారు.