సిద్దిపేట, డిసెంబర్ 17(నమస్తే తెలంగాణ ప్రతినిధి): మూడో విడతలో బుధవారం జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కారు జోరు కొనసాగింది. బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు భారీ మెజార్టీలతో విజయం సాధించారు. మూడో విడతలో సిద్దిపేట జిల్లాలో కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని కొండపాక, కుకునూరుపల్లిలో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. కుకునూరుపల్లి మండలంలో 14 గ్రామాలకు 12 చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులు ఘనవిజయం సాధించారు. ఇప్పటికే తొలి, రెండో విడత ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో విజయం సాధించిన విషయం తెలిసిందే.
జనగామ నియోజకర్గంలోని చేర్యాల, మద్దూరు, కొమురవెల్లి, ధూళిమిట్ట మండలాల్లో బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు హవా కొనసాగింది. మేజర్ గ్రా మాలు బీఆర్ఎస్ వశం అయ్యాయి. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించి, కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పాలన గురించి వివరించడంతో పాటు కాంగ్రెస్ మోసాలను ప్రజల్లోకి బలంగా తీసుకుపోవడంతో బీఆర్ఎస్ అభ్యర్థులకు కలిసి వచ్చింది. కాంగ్రెస్ జనగామ ఇన్చార్జి కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి స్వగ్రామం నర్సాయపల్లిలో బీఆర్ఎస్ అభ్యర్థి శనిగరం సత్యనారాయణ 341 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
చేర్యాల మండలం వేచరేణిలో బీఆర్ఎస్ అభ్యర్థి పర్పటకం వెంకటలక్ష్మీ దుర్గారెడ్డి 998 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థిపై విజయం సాధించారు.మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని నర్సాపూర్, కౌడిపల్లి, కొల్చారం, చిలిపిచేడ్, శివ్వంపేట, వెల్దుర్తి, మాసాయిపేట మండలాల్లో ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి నేతృత్వంలో బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు ఘన విజయం సాధించారు. సంగారెడ్డి జిల్లా నారాయణ్‌ఖేడ్ నియోజకవర్గంలో అధికార కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ మధ్యన పోటాపోటీగా రసవత్తర పోరు కొనసాగింది.
అధికార కాంగ్రెస్ ఒత్తిళ్లకు తట్టుకొని బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు పోటాపోటీగా తలపడ్డారు. అధికార కాంగ్రెస్ నేతలు మంత్రి పొన్నం ప్రభాకర్ అండతో బీఆర్ఎస్ అభ్యర్థులను చాలా గ్రామాల్లో బెదిరింపులకు గురిచేశారు. వీటిని తట్టుకొని బీఆర్ఎస్ అభ్యర్థులు సత్తా చాటారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎండగట్టడంలో బీఆర్ఎస్ అభ్యర్థులు సక్సెస్ అయ్యారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గ్రామాలకు నెలనెలా నిధులు ఇచ్చి, గ్రామాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో గ్రామాలు నిర్లక్ష్యానికి గురై అంధకారంతో కొట్టుమిట్టాడుతున్నాయి. కాంగ్రెస్ పాలనపై విసుగు చెందిన ప్రజలు బీఆర్ఎస్కు పట్టం కట్టారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజం నెలకొంది. మూడో విడతలో సిద్దిపేట జిల్లాలో 163 గ్రామాలకు 13 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 150 గ్రామాలకు, మెదక్ జిల్లాలో 183 గ్రామాలకు 22 గ్రామాలు ఏకగ్రీవం కాగా, 161 గ్రామాలకు, సంగారెడ్డి జిల్లాలో 234 గ్రామాలకు 27 గ్రామాలు ఏకగ్రీవం కాగా, 207 గ్రామాలకు గురువారం ఎన్నికలు జరిగాయి.

ఓటెత్తిన పల్లెలు
మెదక్ మున్సిపాలిటీ, డిసెంబర్ 17: మెదక్ జిల్లాలోని 7 మండలాల్లో బుధవారం చివరి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. మొత్తం సరాసరిగా 90.68 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్, మధ్యాహ్నం ఒంటిగంటతో ముగిసింది. పలు పోలింగ్ కేంద్రాల్లో ఒంటిగంట వరకు క్యూలో ఉన్న ఓటర్లకు అధికారులు ఓటు వేసే అవకాశం కల్పించారు. మెదక్ జిల్లాలోని 7 మండలాల్లో 183 గ్రామాలలో 22 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం మయ్యాయి.
మిగతా 161 సర్పంచ్ స్థానాలకు, 1528 వార్డు స్థానాలకు 307 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 1220(ఒక స్థానానికి ఎన్నిక జనగలేదు) స్థానాలకు ఎన్నికలు జరిగాయి. భోజన విరామం అనంతరం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఎన్నికలు జరిగినా ఏడు మండలాల్లో మొత్తం ఓటర్లు 1,62,348 ఉండగా, 1,47,210 మంది ఓటర్లు ఓటు వేశారు. ఇందులో పురుషులు 71,661, మహిళలు 75,548, ఇతరులు ఒకరు ఉన్నారు.
పోలింగ్ శాతం ఇలా..
ఉ. 9 గం.ల వరకు 24.22 శాతం
ఉ. 11 గంటలకు 63.81 శాతం
మ. ఒంటి గంటకు 90.68 శాతం
