మెదక్, మే 28 (నమస్తే తెలంగాణ) : ప్రతి సంవత్సరం ఖరీఫ్ సీజన్ వచ్చిందంటే చాలు నకిలీ విత్తనాలతో రైతులు కుదేలవుతున్నారు. వ్యవసాయశాఖ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడంతో విక్రయదారులు నకిలీ, నాసిరకం విత్తనాలను రైతులకు అంటగడుతున్నారు. పుట్టగొడుగుల్లా పుట్టుకువస్తున్న పలు కంపెనీలకు చెందిన డీలర్లు నకిలీ విత్తనాలను గ్రామాల్లో ఎకువగా విక్రయిస్తున్నారు.
వ్యవసాయశాఖ అధికారులు విత్తనాల దుకాణాల్లో తనిఖీలు చేస్తున్నారే తప్పా గ్రామాల వైపు కన్నెత్తి చూడటం లేదనే విమర్శలు ఉన్నాయి. మెదక్ జిల్లాలోని పలు మండలాల్లో నకిలీ విత్తనాలు కొనుగోలు చేసిన కర్షకులు అనేక నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. నకిలీ విత్తనాలను విక్రయించే వారిపై కఠిన చర్యలు చేపట్టకపోవడంతో ప్రతి సంవత్సరం రైతులు నట్టేటమునుగుతున్నారు. మెదక్ జిల్లాలోని ఆయా మండలాలు, డివిజన్ కేంద్రాల్లో ప్రత్యేక టాస్‌ఫోర్స్, వ్యవసాయశాఖ అధికారులు ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేపడుతున్నారు. తాజాగా నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై పీడీ యాక్టు కింద కేసు నమోదు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
మెదక్ జిల్లాలో పంటల సాగు ఇలా…
మెదక్ జిల్లాలో ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయమే. జిల్లాలో సుమారు 3.50 లక్షల ఎకరాల్లో సాగు విస్తీర్ణం ఉంది. ఇందులో వరి 3,05,100 ఎకరాల్లో సాగు చేస్తుండగా, పత్తి 37,200 ఎకరాలు, మొక్కజొన్న 2,640 ఎకరాలు, కందులు 1,500 ఎకరాలు, పెసర్లు 1,500 ఎకరాలు, మినుములు 550 ఎకరాలు, జొన్నలు 100 ఎకరాలు, సోయాబిన్ 140 ఎకరాలు, కూరగాయలు 708 ఎకరాలు, ఆయిల్‌పామ్ 456 ఎకరాల్లో సాగవుతున్నాయి. జిల్లాలో ఎకువగా పత్తి పంటసాగు చేస్తుండడంతో కొంతమంది ప్రైవేట్ వ్యాపారులు పలు రకాల విత్తన కంపెనీల పేరుతో మారెట్లో విత్తనాలు విక్రయిస్తున్నారు. అందులో చాలా వరకు నకిలీ విత్తనాలను రైతులకు అంటగట్టి వ్యాపారులు సొమ్ముచేసుకుంటున్నారు.
నకిలీ విత్తనాలు అరికట్టేందుకు చర్యలు…
మెదక్ జిల్లాలో 21 మండలాలు ఉన్నాయి. నకిలీ విత్తనాలు అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఇప్పటికే అన్ని మండలాల వ్యవసాయశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశామని మెదక్ జిల్లా వ్యవసాయాధికారి వినయ్‌కుమార్ ‘నమస్తే తెలంగాణ’కు వెల్లడించారు. మండలానికో టాస్‌ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేశామని, ఎకడా నకిలీ విత్తనాలు సరఫరా చేస్తున్నట్లు త మ దృష్టికి వచ్చినా వారిపై పీడీ యాక్టు ప్రయోగించడం తో పాటు కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన టాస్‌ఫోర్స్ కమిటీలో తహసీల్దార్, ఎస్సై, వ్యవసాయశాఖ అధికారులు ఉంటారన్నారు. వీరు ఆయా మండల కేంద్రాల్లోని విత్తనాలు, ఎరువుల దుకాణాలు, గోదాముల్లో తనిఖీలు చేస్తారన్నారు. ట్రాన్స్‌పోర్టుల వద్ద సైతం కమిటీ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహిస్తామన్నారు. గోదాములు, విత్తనాల డీలర్ల షాపుల్లో తనిఖీలు చేపడుతున్నామన్నారు.
విత్తనాలు, ఎరువులకు రసీదు తప్పనిసరి..
విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసే సమయంలో రైతులు తప్పకుండా రసీదు తీసుకోవాలని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. నష్టం వాటిల్లినప్పుడు రసీదు ఉంటేనే ప్రభుత్వం తరపున సాయం అందే వీలుంటుందని, లేదంటే నకిలీ విత్తనాలతో నష్టపోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. కొందరు గ్రామాలకు వచ్చి విత్తనాలు విక్రయించే వారు రైతులకు ఎలాంటి రసీదులు ఇవ్వకుండా విత్తనాలను అంటగడుతున్నారు. అవగాహన లేని కారణంగా రైతులకు నష్టం జరుగుతోంది. వ్యవసాయశాఖ అధికారులు, పోలీసు అధికారులు ప్రత్యేక నిఘా పెడితే తప్పా అక్రమాలను అరికట్టడం సాధ్యంకాదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని, రైతులను నకిలీల నుంచి కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.