పటాన్చెరు రూరల్, డిసెంబర్ 28 : సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలో సిగాచి పరిశ్రమలో జూన్ 30న జరిగిన పేలుడులో అగ్ని ప్రమాదం సంభవించి 54మంది కార్మికులు, సిబ్బంది సంఘటనా స్థలంలోనే దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. పలువురు తీవ్రగాయాలతో చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించి మృతిచెందారు. కాగా, బాధితులకు పరిహారం అందించడం, సాయం చేయడంలో తీవ్ర నిర్లక్ష్యంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. అంతేకాకుండా పరిశ్రమ యాజమాన్యంపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై అధికారులపై హైకోర్టు జడ్జిలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఎట్టకేలకు పోలీసుల్లో కదలికి వచ్చింది. శనివారం రాత్రి కేసు విచారణ అధికారి, పటాన్చెరు డీఎస్పీ ప్రభాకర్ నేతృత్వంలో బీడీఎల్ భానూర్ పోలీసులు సిగాచి ఇండస్ట్రీస్ సీఈవో అమిత్రాజ్ సిన్హాను అరెస్టు చేసి సంగారెడ్డి కోర్టులో హాజరుపర్చారు. కోర్టు ఆయనకి 14రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. అమిత్రాజ్ సిన్హాను కోర్టు అదేశాల మేరకు కంది జైలుకు తరలించారు. అమిత్రాజ్ సిన్హా ఏ2గా సిగాచి ప్రమాదం కేసులో ఉన్నారు.
హైకోర్టు ఆగ్రహంతోనే చర్యలు…
ఈనెల 30న సిగాచి పరిశ్రమ ప్రమాదంపై హైకోర్టులో విచారణ ఉంది. సిగాచి బాధితులకు రూ. కోటి నష్టపరిహారం చెల్లింపులో నిర్లక్ష్యం, ప్రమాదంలో 54మంది మరణిస్తే యాజమాన్యంపై కఠినంగా వ్యవహరించకపోవడంపై ఈనెల 9న హైకోర్టు ప్రభుత్వం, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధ్యులను అరెస్టు చేయకపోవడాన్ని న్యాయమూర్తులు తీవ్రంగా పరిగణించారు. జరిగిన ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం సరైన విచారణ, దర్యాప్తు చేయడం లేదని జడ్జిలు అసహనం వ్యక్తం చేశారు. కంపెనీ యజమాన్యం నిర్లక్ష్యం వల్లనే ప్రమాదం జరిగినట్లు ప్రభుత్వం నియమించిన హైలెవల్ కమిటీ, నిపుణుల కమిటీ తేల్చాయి. స్ప్రే డ్రైయర్ పేలుడుపై దర్యాప్తు నివేదికను ఇచ్చారు. ఈ కమిటీల నివేదిక మేరకే అధికారులు యజమాన్యంపై చర్యలకు దిగారు. ఏ2గా ఉన్న అమిత్రాజ్ సిన్హాను అరెస్టు చేశారు.
మిగిలిన నిందితుల అరెస్టులపై పోలీసులు వివరణ ఇవ్వడం లేదు. ఇప్పటి వరకు సీఎం, యజమాన్యం ఇస్తుందని ప్రకటించిన రూ. కోటి నష్టపరిహారం మాత్రం పూర్తి స్థాయిలో చెల్లించలేదు. 54మందికి నేటికి పరిశ్రమ తరపున రూ. 25లక్షలే చెల్లించారు. పరిశ్రమలో బీమా, ఇతర బెనిఫిట్స్ మాత్రం కొందరికే ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం కొంతమందికే రూ. లక్ష అందజేసింది. మృతదేహాలు దొరకని 8మంది కుటుంబాలకు డెత్ సర్టిఫికెట్స్ ఇవ్వలేదు. కోర్టు ఆదేశాల మేరకు ఈనెల 29న డెత్ సర్టిఫికెట్లు ఇచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ డెత్ సర్టిఫికెట్స్ వస్తేనే అందరికీ నష్టపరిహారం చెల్లిస్తారేమో అనే ఆశతో బాధిత కుటుంబాలు వేచి ఉన్నాయి. హైకోర్టులో ఈనెల 30న తీసుకున్న చర్యలపై అధికారులు వివరణ ఇవ్వాల్సి ఉంది. కోర్టు ఆదేశాలతో రూ. 75లక్షలు కంపెనీ నుంచి ఇప్పించడంపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.