పనిచేసేచోట కావచ్చు.. చదువుకునే విద్యాలయంలో కావచ్చు.. ప్రయాణిస్తున్న సమయంలో.. లేదా ఇంటివద్ద, ఇలా ఎక్కడ వేధింపులు ఎదురైనా మహిళలకు అండగా నిలుస్తున్నాయి షీటీమ్స్. మహిళల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన షీటీమ్‌లు అద్భుతంగా పనిచేస్తూ అతివలకు భరోసా, ధైర్యాన్ని కల్పిస్తున్నాయి. మెదక్ జిల్లాలో విద్యార్థినులు, మహిళలకు షీటీమ్స్ ఎంతగానో చేరువయ్యాయి. ఆపద సమయంలో మహిళలు, విద్యార్థినులు ఎలా స్పందించాలి అన్న విషయంపై నిరంతరం విస్తృతమైన అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. షీ టీమ్‌లతో పాటు భరోసా, స్నేహిత సెంటర్ల ద్వారా మహిళలకు రక్షణ కల్పిస్తూ ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం అండగా నిలుస్తున్నాయి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల రక్షణ కోసం తీసుకుంటున్న ప్రభుత్వ చర్యలపై ప్రత్యేక కథనం..
– మెదక్ అర్బన్, మార్చి 7
ఫోన్ చేస్తే వెంటనే వాలిపోతారు. ఆకతాయిల ఆగడాలను అడ్డుకుంటారు. సమస్య తీవ్రత, బాధితుల కోరిక మేరకు అవసరమైతే నిందితులపై కేసులు నమోదు చేసి, జైలుకు పంపేలా చేస్తారు. తెలిసీ తెలియని వయసులో పెడదోవ పడుతున్న యువకులను తల్లిదండ్రులతో సహాయంతో కౌన్సెలింగ్ ఇచ్చి సన్మార్గంలో పట్టే బాధ్యతను షీ టీమ్స్ తీసుకున్నాయి.
మెదక్ అర్బన్, మార్చి 7: జిల్లాలో షీ టీమ్స్ నిఘా పెంచి మహిళలపై అసభ్యంగా ప్రవర్తించే పోకిరీల ఆట కట్టిస్తున్నాయి. బస్టాండ్, రైల్వేస్టేషన్, సినిమా థియేటర్లు, కాలేజీలు, పార్కులు తదితర పబ్లిక్ ప్రదేశాల్లో మహిళలను వేధిస్తే మేజర్, మైనర్ అనే తేడా లేకుండా చర్యలు తీసుకుంటున్నాయి. ఈవ్ టీజర్ల భరతం పడుతున్నాయి. మెదక్ జిల్లాలోని మెదక్, తూప్రాన్ డివిజన్లలో షీ టీమ్స్ బృందాలు నిఘా కొనసాగుతున్నాయి. ఒక్కో టీమ్‌లో ఏఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లు, మహిళా కానిస్టేబుల్ ఉంటారు. జనం రద్దీగా ఉండే ప్రాంతాలు, ఫంక్షన్ హాళ్లు, షాపింగ్ మాళ్లు, దేవాలయాల వద్ద షీ టీమ్స్ బృందాలు మఫ్టీలో తిరుగుతుంటాయి.
2022లో 26 కేసులు
షీ టీమ్స్ సేవలు ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు ఊతమిస్తున్నాయి. విద్యార్థినులు, యువతులు, మహిళల రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం షీ టీమ్స్‌ను ప్రవేశపెట్టింది. జిల్లా వ్యాప్తంగా షీ టీమ్స్ ఆధ్వర్యంలో 10 ఎఫ్ఐఆర్లు, 16 సాధారణ కేసులతో పాటు 38 మందికి పోలీసులు కౌన్సెలింగ్ చేశారు. విద్యార్థినులను ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేస్తున్న ఫిర్యాదులే ఎక్కువగా వస్తున్నాయి. పాఠశాల స్థాయి నుంచి ఇంటర్, డిగ్రీ, పీజీ వరకు సీనియర్లు, జూనియర్లను వేధిస్తున్న సమయంలో సాయం చేసిన ఘటనలు చాలా ఉన్నాయి. ఫేస్బుక్, వాల్సాప్ పరిచయాలు, స్నేహం ముసుగులో ఎదురువుతున్న వేధింపుల విషయంలో బాధితులకు షీ టీమ్స్ అండగా నిలుస్తున్నాయి. ప్రేమించానంటూ బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతున్నారని యువతులు, విద్యార్థినులు షీ టీమ్స్‌ను ఆశ్రయిస్తున్నారు. ఒంటరిగా పనుల కోసం బయటకు వచ్చే మహిళలను లక్ష్యంగా చేసుకుని వెంటపడడం, మాటలు కలపడం, పరిచయం పెంచుకుని వంకర బుద్ధి ప్రదర్శిస్తున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి.
ప్రేమించి… మోసగించి..
మెదక్ మండలంలో ఒక అమ్మాయిని ఐదేండ్లుగా ప్రేమించుకున్నారు. ఆ తర్వాత నువ్వు నాకు అవసరం లేదని చెప్పడంతో ఆ యువతి తీవ్ర ఆవేదనకు లోనైంది. ప్రేమ పేరుతో మోసం చేశాడని బాధితురాలు షీ టీమ్స్‌కు కాల్ చేసింది. మోసం చేసిన అబ్బాయిపై ఫిర్యాదు చేసింది. దీంతో వెంటనే షీ టీం బృందం నిందితుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసు దర్యాప్తు చేసి, బాధితురాలకి న్యాయం చేసేలా కృషి చేసింది.
ఆకతాయిల వేధింపులు..
మెదక్ పట్టణంలోని సిదార్థ్ పాఠశాల వద్ద అమ్మాయిల చూట్టూ ఆకతాయిలు బైక్‌పై స్టంట్స్ చేస్తూ వేధిస్తున్నారు. దీంతో అమ్మాయిలు ఇంటికి వెళ్లి తమ తల్లిదండ్రుల ద్వారా షీ టీమ్స్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో షీ టీమ్స్ బృందం పాఠశాల వద్ద ఉన్న సీసీ కెమెరాల ద్వారా అమ్మాయిల చూట్టూ తిరిగి స్టంట్స్ చేసిన అబ్బాయిలను గుర్తించి వారిపై కేసు నమోదు చేశారు.
మహిళలను వేధిస్తే జైలుకే
షీ టీమ్స్ 24 గంటలు సేవలు అందిస్తున్నాయి. ఆకతాయిల భరతం పట్టేందుకు రాష్ట్ర ప్రభు త్వం షీ టీమ్స్ వ్యవస్థను ప్రవేశపెట్టింది. అమ్మాయిలను ఎవరైనా వేధిస్తే వెంట నే షీ టీమ్స్‌కు సమాచారం అందించాలి. బస్టాప్, షాపింగ్ మాల్, రద్దీ ప్రదేశాల్లో షీ టీమ్స్ బృందం మఫ్టీలో తిరుగుతూ, ఆకతాయిలపై నిఘా ఉంచుతారు. అమ్మాయిలు, మహిళలను వేధిస్తే జైలుకు పంపిస్తారు.
– రోహిణి ప్రియదర్శిని, ఎస్పీ, మెదక్