గజ్వేల్, అక్టోబర్ 7: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రోడ్లన్నీ గుంతలమయంగా మారాయి. రోడ్లపై ప్రయాణికులు భయంతో ముందుకు వెళ్తున్నారు. నేషనల్ హైవే అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడంతో చిన్నగా ఉన్న గుంతలు ప్రమాదకరంగా అవుతున్నాయి. నిత్యం ప్రయాణికుల రద్దీతో ఉండే రోడ్లు అధ్వానంగా మారాయి. మెదక్ జిల్లా తూప్రాన్ నుంచి గజ్వేల్, జగదేవ్‌పూర్, భువనగిరి వెళ్లే జాతీయ రహదారిపై ప్రమాదకరంగా గుంతలు దర్శనమిస్తున్నాయి.
సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని వర్గల్, గజ్వేల్, జగదేవ్‌పూర్ మండలాల్లో ఆయా గ్రామాల వద్ద రోడ్లు ప్రమాదకరంగా ఉన్నాయి. వర్గల్ మండలం వేలూరు, అనంతగిరిపల్లి నుంచి జగదేవ్‌పూర్ మండలం పీర్లపల్లి వరకు జిల్లాలో సుమారు 45కిలోమీటర్ల వరకు జాతీయ రహదారి ఉం ది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రోడ్డుపై ప్రమాదకరంగా గుంతలు ఏర్పడ్డాయి. అధికారులు పట్టించుకోకపోవడంతో నిత్యం ఏదో ఒక చోట ప్రమాదాలు జరుగుతున్నాయి.
గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మార్గంలో ఇటీవల కురిసిన వర్షాలకు ప్రజ్ఞాఫూర్ ఊర చెరువు అలుగు నీళ్లు రోడ్డుపై నుంచి వెళ్లడంతో దెబ్బతిన్నది. ప్రజ్ఞాఫూర్ నుంచి గజ్వేల్ వైపు వచ్చే వాహనదారులు జాగ్రత్తగా వస్తున్నా అదుపుతప్పి పడిపోతున్నారు. రాత్రి సమయంలో వాహనదారులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ముందుకు సాగుతున్నారు. గజ్వేల్ నుంచి ప్రజ్ఞాపూర్ వరకు గుంతలు అధిక సంఖ్యలో ఏర్పడ్డాయి. గజ్వేల్ మం డలంలోని శ్రీగిరిపల్లి వద్ద కొండపోచమ్మ ప్రాజెక్టులోకి వెళ్లే పైప్‌లైన్‌పై వేసిన సీసీపై తారు దెబ్బతినడంతో భారీగా గుం తలు ఏర్పడ్డాయి.
జగదేవ్‌పూర్ మండలంలోని పోలీస్‌స్టేషన్ సమీపంలో వర్షపు నీళ్లు నిలువడంతో తారు లేచి ప్రమాదకరంగా మారింది. అలిరాజ్‌పేట బ్రిడ్జిపై పదుల సంఖ్యలో గుంతలు ఏర్పడడంతో ఇనుప సీకులు లేచి ప్రమాదకరంగా మారింది. జాతీయ రహదారులను కేంద్రం ఏమా త్రం పట్టించుకోవడం లేదు. తూప్రాన్ రింగ్‌రోడ్డు నుంచి శ్రీగిరిపల్లి రింగ్‌రోడ్డు వరకు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం లో రోడ్డు మధ్యలో డివైడర్, కల్వర్టుల నిర్మాణం కోసం మంజూరైన రూ.19 కోట్లను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి కాగానే రద్దు చేసింది.
అభివృద్ధి పనుల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరైన నిధులను కాంగ్రె స్ రద్దు చేయడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. జాతీయ రహదారిపై ఏర్పడ్డ గుంతలకు మరమ్మతులు చేయించాలని ప్రయాణికులు కోరుతున్నారు.
గుంతలమయంగా రహదారులు
నర్సాపూర్,అక్టోబర్ 7 : రోడ్లు గుంతలమయంగా మారడంతో వాహనదారులు, ప్రయాణికులకు ఇక్కట్లు తప్పడం లేదు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండల కేంద్రం నుంచి వెల్దుర్తి వెళ్లే ప్రధాన రహదారి అధ్వానంగా మారి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. రహదారిపై అక్కడకక్కడ భారీ గుంతలు ఏర్పడడంతో ప్రయాణికులు,వాహనదారులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ప్రయాణించాల్సిన పరిస్థితి వచ్చింది.
నర్సాపూర్ పట్టణ సమీపంలోనే కాకుండా లింగాపూర్, నారాయణపూర్, బ్రాహ్మణపల్లి తదితర గ్రామాల సమీపంలో రోడ్లపై భారీ గుంతలు ఏర్పడ్డాయి. దీంతో వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, సంబంధిత అధికారులు స్పందించి రోడ్లపై ఏర్పడ్డ గుంతలను పూడ్చివేయాలను ప్రయాణికులు కోరుతున్నారు.