చేర్యాల, ఫిబ్రవరి 27: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నా యి. బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమైన ఘట్టాల్లో ఒక్కటైన పెద్దపట్నం బుధవారం రాత్రి వైభవంగా నిర్వహించారు. మహాశివరాత్రి సందర్భంగా బుధవారం రాత్రి జాగరణ చేసిన భక్తులు, బలిజ మేడలమ్మ, గొల్లకేతమ్మలతో కొలువైన మల్లికార్జున స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. గుట్టపైన ఉన్న ఎల్లమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. ఒగ్గు పూజారుల నేతృత్వంలో పెద్దపట్నం కార్యక్రమాన్ని నిర్వహించారు. పంచరంగులతో తయారుచేసిన పట్నం వద్ద ఒగ్గు పూజారులు జానపద పాటలు పాడుతూ, స్వామిని స్త్తుతిస్తూ పెద్దపట్నం నిర్వహించారు.
ఒగ్గు పూజారుల సంఘం అధ్యక్షుడు బొద్దుల కనకయ్య నేతృత్వంలో 159 మంది ఒగ్గు పూజారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. లింగోద్భవ కాలం రాత్రి 12గంటలకు మల్లికార్జున స్వామికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామివారి ఉత్సవ విగ్రహాలను ఆలయ అర్చకులు రాజగోపురం, రాతిగీరలు తదితర ప్రాంతాల్లో ఊరేగించి తిరిగి ఆలయంలోకి తీసుకెళ్లారు. అనంతరం ఒగ్గు పూజారులు రాత్రి 12గంటల తర్వాత పంచరంగులతో 42 వరుసలతో పట్నం తయారు చేశారు. అనంతరం స్వామి వారికి బోనం నివేదనగా చెల్లించగానే, ఆలయ అర్చకులు స్వామి వారి ఉత్సవ విగ్రహాలను తీసుకువచ్చి వేకువజామున పెద్దపట్నం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి దానిని దాటారు.
ఆ తర్వాత భక్తులు పెద్దపట్నం దాటి ఆలయంలో మల్లన్న స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కొంతమంది భక్తులు పట్నం తొక్కేందుకు బారికేడ్లను సైతం లెక్కచేయకుండా దూకడంతో రద్దీని నియంత్రించేందుకు పోలీసులు భక్తులపై లాఠీలు ఝుళిపించారు. 50వేలకు మందికి పైగా భక్తులు క్షేత్రానికి వచ్చారు. ఆలయ ఈవో రామాంజనేయులు ఆధ్వర్యంలో ఆలయ కమిటీ సభ్యు లు, ఏఈవో బుద్ది శ్రీనివాస్, సూపరింటెండెంట్లు శ్రీరాములు, సురేందర్, ప్రధానార్చకుడు మహాదేవుని మల్లికార్జున్, అర్చకులు, ఒగ్గు పూజారులు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. హుస్నాబాద్ ఏసీపీ సతీశ్, చేర్యాల సీఐ శ్రీను, కొమురవెల్లి ఎస్సై రాజు ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు నిర్వహించారు.