చేర్యాల, ఫిబ్రవరి 2 : సిద్దిపేట జిల్లా చేర్యాల మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక విషయంలో అధిష్టానం ముగ్గురు సిట్టింగ్‌లకు మొండి చెయ్యి చూపించింది.బీఆర్ఎస్ మాత్రం మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ముందుగా ప్రకటించి ఒక అడుగు ముందుంది. కానీ అధికార కాంగ్రెస్ గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి విజయం సాధించిన ఇద్దరు కౌన్సిలర్లతో పాటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన మరో ఇద్దరు కౌన్సిలర్లకు టికెట్ కేటాయించకపోగా కొత్తవారికి అవకాశం కల్పించారు.
గత మున్సిపల్ ఎన్నికల్లో రెండో వార్డు నుంచి పోటీ చేసి విజయం సాధించిన కాంగ్రెస్ కౌన్సిలర్ చెవిటి లింగానికి రిజర్వేషన్ కలిసి రాకపోవడంతో పక్కనే ఉన్న మూడో వార్డు జనరల్ మహిళకు రిజర్వ్ కావడంతో సిట్టింగ్ కౌన్సిలర్‌గా ఆయన సతీమణి నాగేశ్వరిని పోటీలో దించేందుకు రెడీ అయ్యాడు.కానీ మూడో వార్డులో మాజీ జడ్పీటీసీ కొమ్ము నర్సింగరావు సతీమణి రాజేశ్వరిని అభ్యర్థిగా ప్రకటించారు.గత మున్సిపల్ ఎన్నికల్లో 11వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన ముస్త్యాల తారయాదగిరి అదే వార్డు జనరల్‌గా రిజర్వ్ కావడంతో ఆయనే పోటీ చేసేందుకు సిద్ధం కాగా, కాంగ్రెస్ అధిష్టానం గుస్క వాసంతికి టికెట్ కేటాయించింది. గత మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా ఐదో వార్డులో విజయం సాధించిన అడెపు నరేందర్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నాడు.
మున్సిపల్ ఎన్నికల్లో అదే వార్డు ఆయనకు రిజర్వేషన్ కలిసి రావడంతో పోటీ చేసేందుకు ఓ విడత ప్రచారం సైతం పూర్తి చేసుకున్నాడు.కానీ అధిష్టానం ఆయనకు టికెట్ ఇవ్వకుండా గత మున్సిపల్ ఎన్నికల్లో అడెపు నరేందర్ చేతిలో ఓటమిపాలైన వెలుగల దుర్గయ్యకు ఈసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పించారు. గతంలో 12వ వార్డు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించిన పచ్చిమడ్ల సతీశ్ కొన్ని మాసాల క్రితం కాంగ్రెస్‌లో చేరాడు. మున్సిపల్ ఎన్నికల్లో తనకు 12వ వార్డు నుంచి పోటీ చేసేందుకు కాంగ్రెస్ అవకాశం కల్పిస్తుందని ఆశించినప్పటికీ ఆయనకు నిరాశే ఎదురైంది.
అక్కడ గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓటమిపాలైన ఖాజా సతీమణి షరీఫాకు అధిష్టానం పోటీ చేసేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇస్తూ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాలో పేరు ప్రకటంచింది.మొత్తం మీద కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో పార్టీలో చేరిన వారితోపాటు కాంగ్రెస్‌వాదులుగా పేరుగాంచిన మరో ఇద్దరు అభ్యర్థులకు మొండి చెయ్యి చూపించి కాంగ్రెస్ మార్కు రాజకీయాన్ని హైకమాండ్ చూపించిందని పట్టణ ప్రజలు చర్చించుకుంటున్నారు.కాగా టికెట్లు రాని అభ్యర్థులకు నామినేటెడ్ పదవులు ఇస్తామని బుజ్జగించినట్లు తెలిసింది. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్న వారికి ఇప్పుడు టికెట్లు ఇవ్వని హైకమాండ్ ఎప్పుడో ఇచ్చే నామినేటెడ్ పదవులు ఇస్తారో లేదో వేచి చూడాల్సిందేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.