మెదక్ మున్సిపాలిటీ, డిసెంబర్ 3: యువజనులను ప్రోత్సహించి వారి శక్తియుక్తుల్ని దేశాభివృద్ధికి ఉపయోగపడే విధంగా తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నదని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవన్లో నిర్వహిస్తున్న 2023-జిల్లాస్థాయి యువజనోత్సవాలను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యువజనోత్సవాల్లో విద్యార్థినులు ఎంతో ఉత్సహంగా పాల్గొంటున్నారన్నారు.
యువతలోని ప్రతిభను వెలికి తీయడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ప్రోత్సాహంగా ఉంటాయన్నారు. చదువుతో పాటు సాంస్కృతిక రంగం తదితర వాటిలో ముందుకెళ్లి రాణించాలని ఆకాంక్షించారు. జీవితంలో రిస్క్ తీసుకుంటే ఏదైనా సాధిస్తామని చెప్పిన స్వామి వివేకానంద స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. యువజనోత్సవాల్లో భాగంగా విద్యార్థులు జాతీయ నేతల వేషధారణలతో ఆకట్టుకున్నారు. వారి బృందగానాలు, నృత్యాలతో సభా ప్రాంగణం కరతాళధ్వనులతో మార్మోగింది. ఈ సందర్భంగా పలువురు విద్యార్థినులు ఎమ్మెల్యేను మాతో కలిసి నృత్యం చేయాల్సిందిగా కోరగా, ఎమ్మెల్యే వారితో కలిసి నృత్యాలు చేసి ఉత్సాహపరిచారు.
9, 10 తేదీల్లో రాష్ట్రస్థాయి పోటీలు
జిల్లాస్థాయి యువజనోత్సవాల్లో 15 నుంచి 29 సంవత్సరాల్లోపు వయస్సు గల బృందాలు జానపద నృత్యం, జానపద గీతాల పోటీల్లో పాల్గొన్నారని జిల్లా యువజన క్రీడల అధికారి నాగరాజు తెలిపారు. జానపద నృత్యాల్లో 14 బృందాలు, జానపద గీతాల్లో 9 బృందాలు పోటీల్లో పాల్గొనగా న్యాయ నిర్ణేతలు ఒక్కో అంశంలో ఒక్కో బృందాన్ని విజేతగా ఎంపిక చేశారన్నారు. వీరు ఈనెల 9, 10 తేదీల్లో మహబూబ్‌నగర్‌లో నిర్వహించే రాష్ట్రస్థాయి యువజనోత్సవాల్లో పాల్గొంటారన్నారు.
రాష్ట్రస్థాయిలో ఎంపికైతే జనవరి 12 నుంచి 16 వరకు కర్టాటకలో నిర్వహించే జాతీయస్థాయి యువజనోత్సవాల్లో పాల్గొంటారని తెలిపారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబర్చిన బృందాలకు జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో మెదక్ జడ్పీ వైస్ చైర్పర్సన్ లావణ్యారెడ్డి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, కౌన్సిలర్లు లక్ష్మీనారాయణగౌడ్, ఆర్కే శ్రీనివాస్, కోఆప్షన్ సభ్యులు గంగాధర్, ఉమర్, జిల్లా స్పోర్ట్స్ ఫౌండేషన్ అధ్యక్షుడు జుబేర్, బీఆర్ఎస్ నాయకులు దుర్గాప్రసాద్, కొండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.