గజ్వేల్, సెప్టెంబర్ 15: పేదలకు నాణ్యమైన వైద్యాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రభుత్వం ఏర్పాటైన 2014లోనే గజ్వేల్‌లో మాతా శిశు సంరక్షణ కేంద్రం ద్వారా గర్భిణులు, చిన్న పిల్లల కోసం ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేసి ప్రైవేటుకు వెళ్లి వేలకు వేలు ఖర్చు చేసుకోకుండా సర్కార్‌లోనే నాణ్యమైన సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. సర్కారు దవాఖానలో సరిపడా బెడ్లు లేకపోవడంతో నూతనంగా వంద పడకల దవాఖానను నిర్మించి అందులో వైద్య సేవలను ప్రారంభించింది.
సాధారణ రోగులు, ప్రసవాల కోసం ఎక్కువగా వస్తున్న వారిని దృష్టిలో పెట్టుకొని సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావుల ప్రత్యేక చొరవతో రూ.27.35కోట్లతో మరో వంద పడకల మతాశిశు దవాఖానను నిర్మిస్తుండగా మరో 20 రోజుల్లో అందుబాటులోకి వచ్చేలా అధికారులు పనుల్లో వేగం పెంచారు. త్వరలోనే ఈ దవాఖానను మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రారంభించనున్నారు.
గజ్వేల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా పక్కనే పాత ప్రభుత్వ దవాఖాన స్థలంలోనే రూ. 27.35 కోట్లతో వంద పడకల మాతా శిశు దవాఖానను నిర్మిస్తున్నారు. జీప్లస్-2 పద్ధతిలో నిర్మిస్తున్న ఈ దవాఖాన 75వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నది. మూడు ఫోర్లలో ప్రత్యేక వార్డు గదులను ఏర్పాటు చేశారు.
ఇందులో మూడు ఆపరేషన్ థియేటర్లు, చిన్న పిల్లల కోసం ప్రత్యేక వార్డులు, ఐసీయూ కేంద్రం, చిన్న పిల్లలకు ఆక్సిజన్ సరఫరా చేసేలా ప్రత్యేకంగా ఆక్సిజన్ కేంద్రం, 24 గంటల పాటు వైద్య సేవలు అందించేలా వైద్యుల కోసం ప్రత్యేక గదులు, చిన్న పిల్లల కోసం న్యూబర్న్ కేంద్రం, అందులోనే ప్రత్యేక వార్డు, ఓపీ కోసం వచ్చే వారికి ప్రత్యేక వార్డు గదులున్నాయి. దవాఖానలో రెండు ద్వారాలుండగా అందులో ఒకటి అత్యవసరం, మరొకటి ఓపీ సేవల కోసం ఏర్పాటు చేశారు.
మేన్ గేట్‌ను ఏర్పాటు చేయగా, అందులో ఇన్, అవుట్ ఉన్నాయి. దవాఖానలో రోగులకు వారి బంధువులకు ఎలాంటి నీటి సమస్య లేకుం డా లక్ష 75 వేల లీటర్ల సామర్థ్యం కలిగిన నీటి సంప్‌ను నిర్మించారు. దవాఖాన ఆవరణలో చుట్టూ సిమెంట్ రోడ్డును వేయనున్నారు. వైద్యులు 24 గంటల పాటు అందుబాటులో ఉండేలా వారి కోసం క్వార్టర్స్‌ను నిర్మిస్తున్నారు.
ప్రారంభానికి సిద్ధమవుతున్న దవాఖాన
గజ్వేల్‌లో నూతనంగా నిర్మిస్తున్న వంద పడకల మాతా శిశు దవాఖానను త్వరలో ప్రారంభించుకునేందుకు అధికారులు సిద్ధం చేస్తున్నారు. గజ్వేల్ దవాఖానలోనే ఎక్కువగా వైద్య సేవలు పొందేందుకు ఇతర ప్రాంతాల నుంచి ప్రసవాల కోసం గర్భిణులు, చిన్న పిల్లల చికిత్సల కోసం వస్తుండడంతో అత్యాధునిక హం గులతో కొత్త దవాఖాన నిర్మించారు. ప్రస్తుతం అందులో అన్ని రకాల పనులు పూర్తవగా గ్రిల్స్ బిగించడం, గేట్ ముందుభాగంలో ఫిల్లర్స్కు గ్రానైట్ అతికించడం, కిటికిలు అమర్చే పనులు కొనసాగుతున్నాయి. చిన్నపాటి పనులు పూర్తవగానే సీసీ పనులు ప్రారంభించనున్నారు. అన్ని రకాల పనులు పూర్తవగానే మంత్రి తన్నీరు హరీశ్‌రావు చేతుల మీదుగా ప్రారంభించనున్నారు.