సంగారెడ్డి, మే 7: ఇంజినీరింగ్, మెడిసిన్ చదువుల కోసం ప్రభుత్వం నీట్ పరీక్షలు నిర్వహించింది. ఆదివారం జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోని 8 కేంద్రాల్లో 2778 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరైయ్యారు. మొత్తం 2811 మంది అభ్యర్థులకు 33 మంది గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాల్లో పోలీసు యంత్రాంగం బందోబస్తు కల్పించారు. కేంద్రాలకు వచ్చిన అభ్యర్థులు హాల్ టికెట్ల నంబర్లు తెలుసుకునేందుకు ఆయా కేంద్రాల యజమాన్యం, పోలీసులు సహకారమందించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నీట్ పరీక్షలు కొనసాగాయి. ఎస్వీ జూనియర్ కళాశాలలో 600 మంది అభ్యర్థులకు గాను 594 మంది హాజరై పరీక్షలు రాశారు.
కరుణ ఉన్నత పాఠశాలలో 456 మందికి 449 మంది అభ్యర్థులు హాజరయ్యారు. సెయింట్ ఆంథోనీస్ డిగ్రీ కళాశాలలో 360 మందికి 359 మంది హాజరు కాగా, సెయింట్ ఆంథోనీస్ పాఠశాలలో 360 మంది అభ్యర్థులకు 353 మంది హాజరయ్యారు. సెయింట్ ఆంథోనీస్ జూనియర్ కళాశాలలో 360 మంది అభ్యర్థులకు 353 మంది హాజరు కాగా, పాయనీర్ పాఠశాలలో 288 మందికి 286 మంది అభ్యర్థులు, రిషి ఉన్నత పాఠశాలలో 240 మందికి 239 మంది అభ్యర్థులు, సెయింట్ పీటర్ ఉన్నత పాఠశాలలో 147 మంది అభ్యర్థులకు 145 మంది హాజరయ్యారు.
తాళిబొట్లు, చెవి కమ్మలు తీయించిన యాజమాన్యం..
నీట్ పరీక్షలు రాసి ఇంజినీరింగ్, మెడిసిన్ సీట్లు సాధించి విద్యావంతులు కావాలనే ఉద్దేశంతో పరీక్షలకు హాజరైన మహిళా అభ్యర్థులకు సెయింట్ ఆంథోనీస్ జూనియర్, డిగ్రీ కళాశాలల యజమాన్యం, పోలీసులు బంగారు ఆభరణాలను తొలిగించాలని ఆదేశించారు. మహిళలు పవిత్రంగా భావించే మంగళసూత్రాన్ని పరీక్షల పేరుతో యాజమాన్యాలు తీసివేయించడం, పోలీసుల ప్రవర్తనతో అభ్యర్థులు కోపగించుకున్నారు. ఈ విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందో లేక యాజమాన్యాలు చేస్తున్నాయనే అనుమానాలే అభ్యర్థులను కలవరపెడుతున్నాయి. నీట్ పరీక్షలకు హాజరైన అభ్యర్థుల నుంచి తాళిబొట్లు, చెవి కమ్మలు, కంకణాలు, వాచీలు తీసివేస్తేనే పరీక్షలకు అనుమతి ఉంటుందని కళాశాల యజమాన్యాలు, పోలీసులు ఆదేశించడంతో ఆభరాలు తీసివేసి పరీక్షలకు హాజరు అయ్యారు.