దుబ్బాక, మార్చి 31: దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధే తన లక్ష్యమని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. దుబ్బాకకు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ మంజూరైన సందర్భంగా సోమవారం ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, రెవెన్యూ అధికారులతో కలిసి ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి స్థలాన్ని పరిశీలించారు. దుబ్బాక మండలం హబ్షీపూర్లోని సర్వే నెంబర్ 527లో, దుబ్బాక పట్టణంలో(చీకోడు రోడ్డులో) సర్వే నెంబర్ 1523, 1525ల ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించారు.
యూనివర్సిటీతోపాటు హాస్టల్ సముదాయానికి సుమారు 50ఎకరాల స్థలం అవసరముంటుందన్నారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. దుబ్బాక నియోజకవర్గం మూడు ముక్కలుగా మారిందని, భౌగోళికంగా, పాలనాపరంగా చాలా సమస్యలున్నాయన్నారు. అత్యధిక గ్రామాలతో కూడిన నియోజకవర్గంగా, ఇక్కడ కేవలం వ్యవసాయంపైనే ఆధారపడి ప్రజాజీవనం సాగుతుందన్నారు.
అభివృద్ధిలో చాలా వెనుకంజలో ఉందన్నారు. నియోజకవర్గ సమస్యలపై ఇటీవల శాసనసభలో సీఎం రేవంత్‌రెడ్డిని ప్రత్యేకంగా కలిసి వివరించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. దుబ్బాక అభివృద్ధికి నిధులు కేటాయించాలని సీఎంను కోరగా ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఇందులో భాగంగా దుబ్బాకకు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ మంజూరు కావడం, హబ్షీపూర్ నుంచి లచ్చపేట వరకు రోడ్డు విస్తరణకు రూ.35 కోట్లు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
మల్లన్నసాగర్ ఉన్నా సాగునీటి సమస్య
తలాపున మల్లన్నసాగర్ ఉన్నప్పటికీ సాగునీటి సమస్య తీవ్రంగా ఉందని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంత రైతులకు మల్లన్న సాగర్ సాగునీరు సరఫరా చేయకపోవడం దురదృష్టకరమన్నారు. మల్లన్న సాగర్, కొండ పోచమ్మ ప్రాజెక్టుల ద్వారా దుబ్బాక నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు కాల్వల ద్వారా సాగునీరు అందించడమే లక్ష్యమన్నారు. మల్లన్న సాగర్ కాల్వల నిర్మాణ సమస్యలపై సీఎం రేవంత్‌రెడ్డికి వివరించినట్లు తెలిపారు. దుబ్బాక రెవెన్యూ డివిజన్‌పై చర్చించినట్లు తెలిపారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో 109 మందికి రూ.26 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. కైలాశ్, రవీందర్‌రెడ్డి, ఎల్లారెడ్డి, కృష్ణ, శ్రీనివాస్‌గౌడ్, యాదగిరి పాల్గొన్నారు.