సిద్దిపేట, జూన్ 8(నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి మెదక్ జిల్లాలో అధికారుల బదిలీలకు రంగం సిద్ధమవుతుంది. జిల్లాస్థాయి నుంచి మండలస్థాయి వరకు అధికారులు బదిలీ కానున్నారు. ఏండ్ల తరబడి ఒకే దగ్గర పని చేసిన అధికారులకు స్థాన చలనం తప్పకపోవచ్చు. ఈ పరిస్థితుల్లో జిల్లాల్లో మంచి పోస్టింగ్‌ల కోసం అప్పుడే స్థానిక కాంగ్రెస్ నాయకుల ద్వారా అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. జిల్లాకు చెందిన మంత్రుల వద్దకు అధికారులు పరుగులు తీస్తున్నారు. ఇప్పటికే ఉపాధ్యాయుల బదిలీలకు షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే.
పార్లమెంట్ ఎన్నికలు ముగియడంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇక అధికారుల బదిలీలపై దృష్టి సారించింది. తమకు అనుకూలమైన అధికారులను జిల్లా స్థాయిలో నియమించడానికి అధికారుల జాబితాను సిద్ధం చేస్తున్నారు. జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర హెచ్వోడీలు బదిలీ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒకేచోట పనిచేసిన అధికారులకు స్థానచలనం తప్పదంటున్నారు. జిల్లా నుంచి మండల స్థాయి వరకు తమకు అనుకూలమైన అధికారులను నియమించుకోవడానికి కాంగ్రెస్ నాయకులు జాబితాను సిద్ధం చేసి జిల్లాకు చెందిన మంత్రులకు ఇవ్వనున్నారు.
కొంతమంది అధికారులు స్థానిక నాయకుల సహకారంతో మంచి పోస్టు కోసం అప్పుడే బేరసారాలు మాట్లాడుకుంటున్నారు. శాసనసభ, పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఇతర జిల్లాల నుంచి వచ్చిన అధికారులు వారి సొంత ప్రాంతాలకు వెళ్లిపోతారు. ఈ నేపథ్యంలో అన్ని శాఖల్లోని అధికారుల్లో బదిలీలపై జోరుగా చర్చ జరుగుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉమ్మడి మెదక్ జిల్లాలో కొంతమంది అధికారులు బదిలీ అయ్యారు. ప్రస్తుతం కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు సైతం బదిలీ అవుతారన్న చర్చ సైతం జరుగుతున్నది. వీరితో పాటు జిల్లాలోని ప్రధాన శాఖల హెచ్‌వోడీల బదిలీలకు కూడా రంగం సిద్ధం చేస్తున్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తమకు నచ్చిన అధికారులను తెచ్చుకునే పనిలో నేతలు ఉన్నారు. తాము చెప్పింది చేసే అధికారి ఉండాలని అధికార పార్టీ నేతలు కోరుకుంటున్నారు. ఏ అధికారి ఎన్ని ఏండ్ల నుంచి పని చేస్తున్నారు. ఎవరెవరు ఎక్కడ పని చేస్నున్నారు అని ఆరా తీసి తమకు అనుకూలమైన అధికారుల జాబితాను సిద్దం చేసే పనిలో కొంతమంది నేతలు ఉన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా పని చేసిన అధికారుల బదిలీలు తప్పవు అనే చర్చ అన్నిచోట్లా నడుస్తుంది. ఎలాగో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో ఒక్క చోటికి బదిలీ చేస్తుంది… ఇక తమ బదిలీ ఎప్పుడు వచ్చినా వెళ్లేందుకు అధికారులు సిద్ధమతున్నారు. కనీసం ఇక్కడ కాకపోయిన వేరే చోటైనా పక్క జిల్లాలోనే ఉంటే బాగుండు అని కోరుకుంటూ తమతమ ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు.