జహీరాబాద్, ఏప్రిల్ 2 : జహీరాబాద్-బీదర్ ప్రధాన రహదారిని నాలుగు వరుసలుగా అభివృద్ధి చేయడంతో పాటు హైవేగా మార్చాలనే కల సాకారం కావడం లేదు. సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్-బీదర్ ప్రధాన రహదారి మీదుగా నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. జహీరాబాద్ పాత ఆర్టీఏ చెక్‌పోస్టు నుంచి బీదర్ వరకు 32 కిలోమీటర్ల పొడవున ఈ రహదారిపై వాహనాల రద్దీ నెలకొంటుంది. మహారాష్ట్ర, కర్ణాటకతో పాటు తెలంగాణకు రాకపోకలు సాగించడానికి ప్రధాన రహదారి ఇది.
జహీరాబాద్, న్యాల్కల్ మండలాల మీదుగా తెలంగాణ పరిధిలో 19 కిలోమీటర్లు రోడ్డు విస్తరించి ఉంటుంది. 13 కిలోమీటర్ల పరిధిలో రోడ్డు కర్ణాటకలోని బీదర్ జిల్లా పరిధిలోకి వస్తుంది. ఈ రోడ్డు గుండా కొత్తూర్, దిడ్గి, మిర్జాపూర్(బీ), ఖలీల్పూర్, గంగ్వార్, మామిడ్గి, హుస్సేల్లి, గణేశ్‌పూర్ గ్రామా లు ఉంటాయి. ఈ గ్రామాల వద్ద మూల మలుపులు, గుంతలు, ఎత్తుపల్లాలుగా రోడ్డు ఉంది. ఎక్కడ సూచికలు బోర్డులు, రేడియం స్టిక్కర్లు లేవు. దీంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. కర్ణాటక పరిధిలోని సం బంధిత అధికారులు రోడ్డుకు ఇరువైపులా ప్రమాద నివారణ బోర్డులు ఏర్పాటు చేశారు. రద్దీ రహదారి కావడంతో తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతుండడంతో పాటు ఎంతోమంది క్షతగాత్రులుగా మారుతున్నారు.
రోడ్డు ప్రమాదాల నివారణపై ఆర్అండ్బీ అధికారులు దృష్టిసారించడం లేదు. ఈ రోడ్డు గుంతలతో అధ్వానంగా మారడంతో గతేడాది ప్రభుత్వం రూ.5.60 కోట్ల నిధులు మంజూరు చేసింది. కాంట్రాక్టర్ ఆగమేఘాల మీద రోడ్డుకు మరమ్మతులు చేపట్టారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో తూతూమంత్రంగా రోడ్డుకు మరమ్మతులు పూర్తిచేశారు. దిడ్గి, కొత్తూర్(బీ), నారింజ వాగు ప్రాజెక్టు, ఖలీల్ఫూర్, మిర్జాపూర్(బీ), హుస్సేల్లి గ్రామ శివారులో రోడ్డుపై గుంతలు అధ్వానంగా మారా యి.

ఈ రోడ్డు గుండా రాకపోకలు సాగించే వాహనచోదకులు నరకయాతన పడుతున్నారు. రాత్రుళ్లు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గమ్యస్థానాలకు చేరుకోవాల్సి పరిస్థితి ఉంది ఈ రోడ్డును నాలుగు వరుసలుగా విస్తరిస్తామంటూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పలుమార్లు ప్రకటనలు చేసినా ఫలితం లేకుండా పోయింది. రెండేండ్ల క్రితం జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ వికారాబాద్ జిల్లా మన్నెగుడ-తాండూరు మీదుగా జహీరాబాద్-బీదర్ రోడ్డును జాతీయ రహదారిగా గుర్తించేందుకు సర్వే చేపడుతున్నట్టు ప్రకటించినా కార్యరూపం దాల్చలేదు. ఇటీవల జహీరాబాద్ ఎంపీ సురేశ్‌కుమార్ షెట్కార్ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దృష్టికీ జహీరాబాద్-బీదర్ రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించాలని వినతి పత్రం అందజేశారు. ఈ రోడ్డు నాలుగు వరుసలుగా విస్తరించేది ఎప్పుడో కానీ.. అసంపూర్తిగా నిలిచిపోయిన మరమ్మతు పనులు వెంటనే పూర్తిచేయాలని వాహనచోదకులు కోరుతున్నారు.