మునిపల్లి, ఫిబ్రవరి 25: సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం బుదేరా పరిధిలో ముంబై జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు ఒకే కుటుంబ సభ్యులు మరణించిన ఘటన మంగళవారం రాత్రి జరిగింది. మునిపల్లి ఎస్ఐ రాజేష్ నాయక్ తెలిపిన వివరాల ప్రకారం ప్రమాదంలో మరణించిన వారు మునిపల్లి మండలం అంతారం గ్రామ నివాసి పిచ్చకుంట్ల లక్ష్మి(54), పిచ్చకుంట్ల రవి (32), పిచ్చకుంట్ల శోభ రాణి (28) ఒకే కుటుంబ సభ్యులు.
వీరు ద్విచక్ర వాహనంపై ముంబై జాతీయ రహదారి మీదుగా బుదేర చౌరస్తా ఫ్లైఓవర్ నుంచి కంకోల్ వైపు నుంచి సదాశివపేట వైపు వెళుతుండగా వెనుక నుంచి వచ్చిన గుర్తులేని వాహనం ఢీ కొట్టింది. తల్లి, కొడుకు, కోడలు అక్కడికిక్కడే మృతి చెందినట్లు ఎస్ఐ తెలిపారు. రోడ్డు ప్రమాదానికి పూర్తి కారణాలు తెలియాల్సి ఉందని చెప్పారు. మృతుడికి ఇద్దరు కొడుకులు (చిన్న పిల్లలు) ఉన్నారని చెప్పారు. తల్లిదండ్రులు మరణించడంతో ఆ చిన్నారులిద్దరికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలవాలని స్థానికులు, యువజన సంఘాల ప్రతినిధులు కోరారు.