కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను క్షేత్రస్థాయిలో అమలు చేసి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీతాలక్ష్మారెడ్డి (MLA Sunitha Laxma reddy) అన్నారు. మంగళవారం నర్సాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో నిర్వహించిన ప్రజాపాలనలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా 6 గ్యారెంటీలను (Six Gurantees) పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు.
పారదర్శక పాలనకు తామెప్పుడూ సహకరిస్తామని, ప్రజలకు ఉపయోగపడే మంచి పనులను స్వాగతిస్తామని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అహర్నిశలు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఇప్పటికే కొన్ని వాగ్దానాలు విస్మరించిందని గుర్తు చేశారు. అధికారంలోకి రాగానే డిసెంబర్ 9 న రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని, రైతు భరోసా, యాసంగి పంటలు ప్రారంభమైనప్పటికీ పూర్తిస్థాయిలో రైతుల ఖాతాల్లోకి డబ్బులు రాలేదని ఆరోపించారు.
రైతులకు గిట్టుబాటు ధరతోపాటు క్వింటాలుకు రూ. 500 బోనస్ ఇవ్వలేదని పేర్కొన్నారు. మాట తప్పకుండా ఆరు గ్యారెంటీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కొత్త రేషన్ కార్డు (New ration Card) మంజూరు కోసం వైట్ పేపర్‌పై కుటుంబ సభ్యుల ఆధార్ కార్డుల జిరాక్స్ జతతో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.