దుబ్బాక, ఫిబ్రవరి 15: దుబ్బాకను రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి శాసనసభలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం శాసనసభ సమావేశాల్లో భాగంగా తొలిసారి ఆయన మాట్లాడారు. దుబ్బాకను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేయాలనే డిమాండ్ చాలా రోజుల నుంచి ఉందన్నారు. నియోజకవర్గంలో ఉన్న 8 మండలాలు రెండు (సిద్దిపేట, మెదక్) జిల్లాల్లో, మూడు డివిజన్లలో సిద్దిపేట, గజ్వేల్, మెదక్ పరిధిలో ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. దీంతో పాటు పాలనాపరమైన సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. ఈ విషయంపై ప్రభుత్వం స్పందించి తక్షణమే దుబ్బాకను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటించాలన్నారు.
పట్టణానికి రింగ్‌రోడ్డుతో పాటు వివిధ అభివృద్ధి పనుల గురించి ప్రస్తావించారు. దుబ్బాక మున్సిపాలిటీకి గత ప్రభుత్వంలో మంజూరైన నిధులను ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు వెనక్కి తీసుకుందని, ఆ నిధులను వెంటనే విడుదల చేసి పనులను ప్రారంభించాలని కోరారు. ప్రొటోకాల్, అభివృద్ధి పనులపై ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులకు విన్నవించినట్లు గుర్తుచేశారు. దుబ్బాకలో ఓ కాంగ్రెస్ నాయకుడు ఇష్టారీతిలో ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడని, అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రొసీడింగ్‌లు అందిస్తానని హంగూఆర్బాటాలు చేస్తున్నాడని ఆరోపించారు. దీంతో ప్రజలు అయోమయానిగి గురవుతున్నారన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో దుబ్బాకలో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావును ప్రొటోకాల్‌తో గౌరవించామని గుర్తు చేశారు.