మెదక్ మున్సిపాలిటీ, మే 29: వానకాలం సాగు కోసం మెదక్ జిల్లాలో విత్తనాలు, ఎరువులకు కొరత లేదని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రాథమిక సహకార కేంద్రంలో గోదామ్లను సందర్శించారు. రైతులకు పంపిణీ చేస్తున్న జీలుగ విత్తనాలు, ఎరువుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వానకాలం జిల్లాలో 3,73,509 ఎకరాల్లో సా గు అవుతుందని వ్యవసాయాధికారులు అంచనా వేశారన్నారు. దీనిలో వరి 3,27,113, పత్తి 4,0169 ఎకరాలు, మొక్కజొన్న 2,820 ఎకరాలు, కంది 1,125 ఎకరాలు, ఇతర పంటలు 1,832 ఎకరాల్లో సాగుకు ప్రణాళికలు తయారు చేశారన్నారు. ప్రణాళిక అంచనాల ప్రకారం విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండేలా అన్ని చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ప్రస్తుతం 32,088 వేల ప్యాకెట్ల పత్తి విత్తనాలు అందుబాటులో ఉన్నట్లు ఆయన వెల్లడించారు.
డీలర్లు ప్రభుత్వ నిబంధనలు పాటించాలన్నారు. ప్రతి డీలర్ లైసెన్స్ రెన్యూవల్ చేసుకోవాలని, తమ దుకాణాల్లోని స్టాక్ వివరాలు బోర్డుపై స్పష్టంగా ఉంచుతూ వాటి వివరాలు ఆన్లైన్లో ఎంట్రీ చేయాలని సూచించారు. గుడువు ముగిసిన ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు అమ్మరాదన్నారు. ప్రతి అమ్మకానికి సంబంధించి రసీదు రైతులకు ఇవ్వాలన్నారు. నకిలీ విత్తనాలు ఎక్కడైనా విక్రయాలు జరిగితే రైతులు వ్యవసాయధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. పచ్చిరొట్ట విత్తనాలు నాటుటకు జూన్ రెండోవారం వరకు సమయం ఉందన్న విషయాన్ని రైతులు గుర్తించాలన్నారు. పచ్చిరొట్ట విత్తనాలు జిల్లాలో 6,400 క్వింటాళ్లు అవసరం అవుతాయని, ప్రస్తుతం ఇప్పటివరకు 4,462 క్వింటాళ్లు రైతులకు అందించామని చెప్పారు. మిగిలిన 1,938 క్వింటాళ్ల విత్తనాలు వారం రోజుల్లో రైతులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. మార్కెట్ కమిటీ ఆవరణలో ఎరువుల దుకాణ యాజమానుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయధికారి గోవింద్, తహసీల్దార్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.