నారాయణఖేడ్, జూన్ 20: మక్కలు, జొన్నలు కొనుగోలు చేయమని క్యాబినెట్ సమావేశంలో నిర్ణయించడం తగదని, రైతులను నట్టేట ముంచే ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు.
ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేస్తుండగా, పప్పు ధాన్యాలను నాబార్డు కొనుగోలు చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసే మక్కలు, జొన్న రైతుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. రైతు బీమా ప్రీమియం చెల్లించని కారణంగా మృతిచెందిన రైతు కుటుంబాలకు అందజేసే రూ.5 లక్షల బీమా ఐదు నెలలుగా అందడం లేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో పదకొండు విడతలుగా రూ.72 వేల కోట్ల రైతు బంధు సహాయాన్ని రైతులకు అందజేయగా, మూడు విడతలుగా రైతు భరోసా ఎగ్గొట్టిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయరంగానికి 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తే కాంగ్రెస్ కనీసం పది గంటలు సైతం సరఫరా చేయడం లేదన్నారు.
బీఆర్ఎస్ హయాంలో మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువులను పునరుద్ధరించి రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగు నీరందించిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేండ్లు గడుస్తున్నా కొత్త ప్రాజెక్టు సైతం నిర్మించలేదని, అదనంగా ఒక ఎకరానికి సాగునీరు ఇవ్వలేదని మండిపడ్డారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన వరి, జొన్నల కొనుగోలు కేంద్రాల్లో తరుగు పేరిట పెద్ద ఎత్తున దండుకుంటున్నారని ఆరోపించారు. ఇటీవల ఎమ్మెల్యే సంజీవ్‌రెడ్డి బీఆర్ఎస్ హయాంలో విద్యుత్ ప్రమాద బాధితులకు పరిహారం ఇవ్వలేదని మాట్లాడటం సిగ్గుచేటన్నారు. బీఆర్ఎస్ మండల, పట్టణ అధ్యక్షులు పరమేశ్, నగేశ్, ఖేడ్ మాజీ సర్పంచ్ ఎం.ఏ.నజీబ్, నేతలు విఠల్‌రావు, రాజునాయక్, రవీందర్, మల్గొండ, వెంకట్‌నాయక్, నరేశ్ పాల్గొన్నారు.