వంద సీట్లతో…
నూతనంగా మంజూరైన మెడికల్ కళాశాల వచ్చే విద్యాసంవత్సరం నుంచి అందుబాటులోకి రానుంది. 100 సీట్లతో కళాశాల ప్రారంభంకానున్నది. దీనికి అనుబంధంగా 400 పడకల దవాఖాన ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే ఇప్పటికే జిల్లా కేంద్ర దవాఖానలో 200 పడకల దవాఖానగా ఉండగా, మరో 200 పడకలు అవసరం ఉంటుంది. నూతన మెడికల్ కళాశాల అందుబాటులోకి వస్తే వైద్య విద్య అందించడంతోపాటు వందలాది మందికి ఉపాధి లభించనుంది. అంతేకాకుండా 400 పడకల దవాఖానతో వైద్యసేవలు మరింత విస్తృతం కానున్నాయి.
మెదక్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): మెదక్ జిల్లా కేంద్రంలో మెడికల్ కళాశాల ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. జిల్లాలో వైద్యవిద్యనభ్యసించాలనే పేద విద్యార్థుల కలను ప్రభుత్వం నెరవేరుస్తోంది. అందుకు తగ్గట్లుగానే మెడికల్ కాలేజీలను స్థాపిస్తూ, వైద్యరంగాన్ని పటిష్టం చేస్తోంది. జిల్లాలో మెడికల్ కళాశాల ఏర్పాటుతో పేద విద్యార్థుల కల సాకారం కానుంది. ఈ వైద్య విప్లవంతో మారుమూల ప్రాం తాలకు కూడా సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు అందుతాయని, స్థానికంగా ఉంటూనే ఎంబీబీఎస్ చదివేందుకు అవకాశాలు పెరుగుతాయి. తెలంగాణకు మరో 8 కొత్త మెడికల్ కళాశాలలు మంజూరైన విషయం తెలిసిందే. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం క్యాబినెట్ సమావేశంలో ఆమోదముద్ర వేసింది. మెదక్ జిల్లాకు మెడికల్ కాలేజీ రావడంపై ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి లక్ష్యం నెరవేరబోతోంది. మెడికల్ కళాశాల మంజూరు చేసినందుకు సీఎం కేసీఆర్, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావుకు ధన్యవాదాలు తెలియజేశారు. 2023-24 విద్యా సంవత్సరం నుంచి మెడికల్ కళాశాలలో తరగతులు ప్రారంభంకానున్నాయి.
Drs1
నెరవేరనున్న జిల్లావాసుల కల…
మెదక్ జిల్లా వాసుల కల నెరవేరనున్నది. సోమవారం క్యాబినెట్లో మెడికల్ కళాశాలకు ఆమోద ముద్ర పడింది. దీంతో మెదక్ ప్రాంత వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాకు మెడికల్ కాలేజీ రానుండడంతో అన్ని సేవలు అందుబాటులోకి రానున్నాయి. మెడికల్ కళాశాలతో స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ సేవలు కలుపుకొని వైద్య విభాగాల సేవలు అందే అవకాశముంది. అత్యాధునిక వైద్యపరికరాలు, ల్యాబ్స్ ఉంటాయి. డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది అందుబాటులో ఉంటారు. ఇప్పటివరకు తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలో ఉన్న మెదక్ ప్రభుత్వ ప్రధాన దవాఖానను డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌కు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రభుత్వ వైద్య కళాశాల స్థాపనకు, మెదక్‌లో 100 ఎంబీబీఎస్ సీట్ల కెపాసిటీతో ప్రభుత్వ జనరల్ దవాఖానను అప్‌గ్రేడ్ చేయడానికి పరిపాలన అనుమతులు ఇచ్చింది. మెడికల్ కళాశాల భవన నిర్మాణ పనులు రోడ్లు, భవనాల విభాగానికి అప్పగించారు. అంతేకాకుండా ప్రభుత్వ జనరల్ దవాఖానని అప్‌గ్రేడ్ చేయడం, పరికరాలు, ఫర్నిచర్ సేకరణ పనులు టీఎస్ఎంఎస్ఐడీసీకి అప్పగించారు. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న మెదక్ జిల్లా వాసుల చిరకాల కోరిక వైద్య కళాశాల ఏర్పాటుతో సాకారమైంది. ప్రస్తుతం వైద్య కళాశాల మంజూరుతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని విద్యార్థులు వైద్య విద్య కోసం హైదరాబాద్, వరంగల్‌తోపాటు సుదూర ప్రాంతాలకు వెళ్తున్నారు. మెడికల్ కళాశాల మంజూరుతో ఉన్నత విద్య అందుబాటులోకి రానుంది.
సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు
క్యాబినెట్ సమావేశంలో మెదక్ మెడికల్ కళాశాలకు ఆమోదం తెలిపిన సీఎం కేసీఆర్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మెడికల్ కళాశాల ఏర్పాటుతో గ్రామీణ, పట్టణ విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుంది. మెడిసిన్ చదవాలన్న విద్యార్థుల కోరికను సాకారం చేస్తుంది. 100 సీట్లతో మెడికల్ కాలేజీను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా మెదక్‌కు నర్సింగ్ కళాశాల కూడా మంజూరుకానుంది.
– పద్మాదేవేందర్‌రెడ్డి, మెదక్ ఎమ్మెల్యే