సిద్దిపేట కమాన్, జనవరి 1: నూతన సంవత్సరం వేడుకల్లో భాగంగా సిద్దిపేట కోమటి చెరువు సోమవారం సందడిగా మారింది. చిన్నారులు, పెద్దలు, యువతులు, కుటుంబాలతో సహా సాయంత్రం పెద్దఎత్తున కోమటి చెరువుకు చేరుకున్నారు. అక్కడ సస్పెన్షన్ బ్రిడ్జి, వివిధ రంగుల్లో విద్యుత్ దీపాలు, బోటింగ్, డైనోసార్ పార్కు తదితర వాటిని సందర్శిస్తూ ఎంజాయ్ చేశారు. కోమటి చెరువు కట్ట ఎటుచూసినా ప్రజలతో కిక్కిరిసిపోయింది. కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టామని, ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలని కుటుంబ సభ్యులతో కలిసి వచ్చినట్లు పలువురు తెలిపారు.