చేర్యాల, ఆగస్టు 21: జనగామ అసెంబ్లీ స్థానానికి అభ్యర్థ్ధి పేరు ప్రకటనను సీఎం కేసీఆర్ పెండింగ్‌లో పెట్టడంతో నియోజకవర్గంలోని బీఆర్ఎస్ నేతల్లో టెన్షన్ నెలకొన్నది. ఇండియా-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ జరిగితే అభిమానుల్లో ఏ విధమైన టెన్షన్ ఉంటుందో జనగామ, చేర్యాల ప్రాంతాల్లో పార్టీ నాయకులతో పాటు ప్రతిపక్షాల నేతలు సైతం ఉత్కంఠలో ఉన్నారు. కొంతకాలంగా జనగామ నియోజకవర్గంలో టికెట్ మా నాయకునికి వస్తుందంటే మా నాయకునే వస్తుందని సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డితో పాటు ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, నాయకులు మండల శ్రీరాములు, నాగపురి కిరణ్‌కుమార్ అభిమానులు చర్చించుకుంటున్నారు.
సీఎం కేసీఆర్ ప్రకటించిన తొలి జాబితాలో జనగామ అభ్యర్థి పేరు లేకపోవడంతో ఆయా నేతల అభిమానులు మరింత టెన్షన్‌లోకి వెళ్లిపోయారు. కొన్ని రోజులుగా నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితులతో పార్టీ అభిమానులు, కార్యకర్తలు టెన్షన్లో ఉన్నారు. మరో మూడు, నాలుగు రోజుల్లో అభ్యర్థిని ప్రకటిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో మరికొన్ని రోజుల వరకు టెన్షన్ భరించాలి అంటూ పలువురు నాయకులు చర్చించుకున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సోమవారం ఉదయం ఎమ్మెల్సీ కవిత నివాసానికి వెళ్లి ఆమెతో చర్చలు జరిపి తిరిగి వెళ్తున్న సమయంలో విక్టరీ సింబల్ చూపించారు.
ఎమ్మెల్యే విక్టరీ సింబల్ చూపించడంతో ఆయనకే టికెట్ అంటూ స్థానికంగా చర్చ సాగింది. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ఆదివారం కొమురవెల్లి మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. అనంతరం చేర్యాల పట్టణంలోని ఫంక్షన్ హాల్లో అభిమానులు, కార్యకర్తలను కలుసుకున్నారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డికి చెందిన అభిమానులు, బీఆర్ఎస్ నాయకులు అన్ని గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ముగ్గురు నేతలలో ఎవరికి టికెట్ వరిస్తుందో మరో మూడు రోజుల్లో తేలనుంది.