రాయపోల్,అక్టోబర్ 7 : ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం,పచ్చదనాన్ని కల్పించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం పల్లెల్లో పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసింది. వాటి నిర్మాణానికి లక్షలు ఖర్చు చేసింది. మొక్కలు నాటి సంరక్షణ చర్యలు చేపట్టింది. కానీ నేడు కాంగ్రెస్ హయాంలో క్షేత్రస్థాయిలో పల్లెల్లో ప్రకృతి వనాల పరిస్థితి అధ్వానంగా మారింది. సరైన నిర్వహణ,అధికారుల పర్యవేక్షణ లేక ప్రకృతి వనాలు నేడు ఎడారిలా మారాయి. మొక్కలు దెబ్బతినకుండా కంచెలు, బోర్డులు ఏర్పాటు చేశారు తప్పా సంరక్షణకోసం నీరు పోయడం విస్మరించారు.
కనీసం ఎండిపోయిన మొక్కల స్థానంలో వేరే మొక్కలు నాటకపోవడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలో 19 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రతి గ్రామంలో పల్లె పకృతి వనాలు ఏర్పాటు చేశారు.లక్షలు ఖర్చుచేసి పల్లెప్రకృతి వనాలు ఏర్పాటు చేసినప్పటికీ అధికారులు నిర్వహణను గాలికి వదిలేశారు.కొన్ని పల్లెప్రకృతి వనాల్లో పశువులు,మేకలు సంచరిస్తున్నాయి. మరికొన్ని పల్లె ప్రకృతి వనాల్లో మొక్కలకు నీరు అందక ఎండిపోయాయి.
పల్లె ప్రకృతి వనాలను బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాం లో పంచాయతీలకు అందించిన ట్రాక్టర్లు, నీటి ట్యాంకర్లు నిరుపయోగంగా మారాయి. కొన్ని గ్రామాల్లో ట్రాక్టర్లకు డీజిల్ కొరత ఉండటంతో ట్యాంకర్లు మూలనపడేశారు.ఇప్పటికైనా జిల్లా, మండల అధికారులు చొరవ తీసుకొని పల్లెప్రకృతి వనాలపై దృష్టి సారించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.