ఎర్రటి ఎండను సైతం లెక్కచేయకుండా జనమంతా తండోపతండాలుగా తరలిరావడంతో చేర్యాల పట్టణంలో గులాబీ గుబాళించింది. పుట్టలలో నుంచి ఉసిళ్లు బయటకు వచ్చినట్లు.. మేడారం సమ్మక్క జాతరకు పోయినట్లు యువకుల నుంచి మొదలుకుని పండుటాకుల వరకు గులాబీజెండాలను చేతిలో పట్టుకుని చేర్యాలకు కదంతొక్కారు. శనివారం చేర్యాల పట్టణంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభ విజయవంతమైంది. చేర్యాల చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో జనం సభకు పోటెత్తడం బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్‌ను నింపగా.. ప్రతిపక్షాల్లో గుబులు పుట్టించింది.
చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట, జనగామ, నర్మెట్ట, తరిగొప్పుల, బచ్చన్నపేట మండలాల నుంచి డప్పుచప్పుళ్లు చేసుకుంటూ.. ఆట పాటలతో సందడి చేసుకుంటూ.. ర్యాలీగా జనం తరలివచ్చారు. కళాకారులు మిట్టపల్లి సురేందర్, దరువు ఎల్లన్నపాడిన పాటలు అందరిలో ఉత్సాహాన్ని నింపాయి. ‘గులాబీల జెండలే రామక్క’, ‘జబ్జకు సంచి చేతుల జెండా’, ‘చంచల్‌గూడ జైల్లో చంద్రవంకలు’ తదితర పాటలు సభను హోరెత్తించాయి. సీఎం కేసీఆర్ సభకు చేరుకోగానే సభలో గులాబీ పూల వర్షం కురిసింది. గులాబీ రెపరెపలతో సభాప్రాంగణం గులాబీమయంగా మారిం ది. కేసీఆర్ నోటి నుంచి వచ్చిన సామెతలకు, విసిరిన చలోక్తులకు సభలోని జనమంతా చప్పట్లతో కేరింతలు కొట్టారు. చేర్యాలను రెవెన్యూ డివిజన్‌గా ప్రకటిస్తానని, చేర్యాలకు ఇంజినీరింగ్ కాలేజీతో పాటు చేర్యాలను అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తానని సీఎం కేసీఆర్ ప్రకటించగానే జనం ‘జై కేసీఆర్’ అంటూ నినదించారు.
చేర్యాలకు వస్తే సొంతూరికి వచ్చినట్లుందని శనివారం చేర్యాలలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ అన్నారు. తనకు చేర్యాల, బచ్చన్నపేట, మద్దూరు, లద్నూర్ తదితర గ్రామాలతో ఉన్న అనుబంధం, స్నేహితులు, గురువుల గురించి ఈ సందర్భంగా తన ప్రసంగంలో గుర్తుచేశారు. చేర్యాల బహిరంగ సభలో సీఎం కేసీఆర్ 42 నిమిషాల పాటు ప్రసంగించారు. చేర్యాలకు తాను సైకిల్‌పై వచ్చి హిందీ నేర్చుకున్నానని, విశారద చదువుకోవడం వల్లే తాను అనర్గళంగా హిందీ మాట్లాడుతున్నట్లు తెలిపారు. చేర్యాల, సిద్దిపేట కలిసి ఉన్న ప్రాంతాలేనని.. తనకు చేర్యాల అంటే ఎంతో ఇష్టమనగానే సభకు వచ్చిన ప్రజలు ఈలలు, కేకలు వేసి సభను హోరెత్తించారు.
చేర్యాలలో శనివారం జరిగిన ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ ప్రసంగం ఆద్యంతం సామెతలు, చలోక్తులతో సాగింది. సీఎం నోటి నుంచి వచ్చిన కొన్ని మాటలు సభలో నవ్వులు పూయించాయి. సంక్షేమ పథకాలు, అభివృద్ధి, ప్రతిపక్ష పార్టీల తీరును ఎండగట్టిన విధానం, వారిపై తన ప్రసంగంలో జనానికి తనదైన శైలిలో ప్రశ్నలు వేసి జవాబులు రాబట్టారు. ‘మంచి పాలిచ్చే బర్రెను అమ్ముకొని.. దున్నపోతును కొనుక్కుంటారా’ తెలంగాణను ఇంతమంచిగా అభివృద్ధి చేస్తున్న బీఆర్ఎస్ను కాదని, ప్రజలు వేరే పార్టీలకు అధికారమిస్తారా.. అని సీఎం కేసీఆర్ అన్నారు. ‘సూరును సదురుకోనోడు.. సూర్యున్ని తెస్తనన్నడంట..ఎనుకటికి ఒకడు’. కాంగ్రెస్ నాయకుల తీరు కూడా అదే మాదిరిగా ఉందని, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో అమలు చేయని పథకాలను తెలంగాణలో అమలు చేస్తామని కాంగ్రెస్ నాయకులు మోసం చేస్తున్నట్లు తెలిపారు‘ సాయి సంసారి.. లచ్చి దొంగ అన్నట్లు..’ కాంగ్రెస్ నాయకులు తెలంగాణ ఉద్యమంలో కలిసి రాకుండా తెలంగాణకు తీరని అన్యాయం చేసి, ఇప్పుడు లపంగ మాటలు మాట్లాడుతున్నారని సీఎం కేసీఆర్ అన్నారు. ‘తీర్థం పోదాం రా తిమ్మక్క అంటే నీవు గుళ్లే.. నేను సల్లే’ అన్న విధంగా కాంగ్రెసోళ్లు ఇచ్చే హామీలకు మోసపూతే గోస పడుతామని సభలో సీఎం కేసీఆర్ ప్రజలను చైతన్యం చేశారు.