గుమ్మడిదల, ఆగస్టు 9: సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం అన్నారం గ్రామశివారులోని గుబ్బ కోల్డ్ స్టోరేజీలో జరిగిన ప్రమాదం అనేక అనుమానాలకు తావిస్తున్నది. 2018లో ప్రత్యేకాధికారుల పాలనలో టీఎస్ఐపాస్ ద్వారా కోల్డ్‌స్టోరేజీ ఏర్పాటుకు అనుమతులు పొందారు. విజిటేబుల్ స్టోరేజీ కోసం కోల్డ్ స్టోరేజీ ఏర్పాటుకు అనుమతులు తీసుకుని ఫార్మా, కెమికల్ ఉత్పత్తులు ఇందులో నిల్వ చేస్తున్నారని, అందుకే ప్రమాదం జరిగిన నాలుగు రోజుల వరకు మంటలు అదుపులోకి రాలేక పోయాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఫార్మా ఉత్పత్తుల నిల్వలే కారణంగా భారీగా మంటలు చెలరేగి, దట్టంగా పొగలు కమ్ముకున్నాయని అనుమానిస్తున్నారు. వెజిటేబుల్, సీడ్స్, సీపుడ్స్కి సంబంధించిన పదార్థాలు మాత్రమే ఈ కోల్డ్‌స్టోరేజీలో నిల్వ ఉంచడానికి అనుమతులు పొంది, యాజమాన్యం అందుకు విరుద్ధంగా కోల్డ్ స్టోరేజీ నిర్వహణ కొనసాగిస్తున్నదని ఆరోపణలు ఉన్నాయి. రసాయన పరిశ్రమలకు చెందిన ముడిసరుకులు, ఉత్పత్తి అయిన రసాయనాల పౌడర్లు, వ్యాక్సిన్లు, రసాయన డ్రమ్ములు స్టోరేజీ చేసినట్లు సమాచారం.
అగ్నిప్రమాదం సంభవించిన బుధవారం రోజు పటాన్చెరు డీఎస్పీ గుబ్బా స్టోరేజీ యజమాని కిరణ్‌తో మాట్లాడారు. అసలు స్టోరేజీలో ఏమి నిల్వలు ఉన్నాయని వివరాలు అడిగినా యాజమాన్యం సరిగ్గా స్పందించలేదని, దీంతో డీఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. కోల్డ్ స్టోరేజీలో నిల్వ ఉన్న పదార్థాలు తెలిస్తే ఫోమ్, నీరు వాడి అదుపు చేయడానికి సులువుగా ఉంటుందని అగ్నిమాపక అధికారులు అడిగినట్లు తెలిసింది.
మంటలు అంటుకున్న రసాయన పదార్థాలకు నీరు తోడైతే మంటలకు మరింత ఆజ్యం పోసినట్లు అవుతుందని వారి అభిప్రాయం.కోల్డ్ స్టోరేజ్‌లో భారీగా పేలే పదార్థాలు ఉన్నాయని యాజమాన్యం చెప్పలేదని, మంటలు మండే తీరును చూసి పోలీస్ అధికారులు, అగ్నిమాపక అధికారులు యజమాన్యాన్ని ప్రశ్నించారు. అయినా వారు వెల్లడించలేదు. అధికారులు గట్టిగా ప్రశ్నించడంతో సల్ఫర్, ఇతర రసాయన పదార్థాలు ఉన్నాయని తెలుపడంతో వచ్చిన ఫైరింజన్లు సైతం ఘటనా స్థలం నుంచి దూరంగా వెళ్లాయి.
అందుకే మంటలను అదుపు చయడానికి 16 గంటల సమయం పట్టిందని అధికారులు వెల్లడించారు. గుబ్బా కోల్డ్ స్టోరేజీలో రసాయన పరిశ్రమలకు చెందిన 127 రకాల రసాయన ఉత్పత్తులు నిల్వ చేయగా, ప్రమాదం సంభవించడంతో కోట్లాది రూపాయల నష్టం జరిగినట్లు తెలిసింది. కోల్డ్ స్టోరేజీకి రూ. 30 కోట్ల బీమా ఉందని పోలీస్ అధికారులు వెల్లడించారు. కేవలం వెజిటేబుల్, సీడ్స్, సీపుడ్స్ పదార్థాలు నిల్వ చేయడానికి ఇంత పెద్ద మొత్తం బీమా చేయించాల్సిన అవసరం లేదని పలువురు అనుమానిస్తున్నారు. అధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేపడితే అన్ని విషయాలు బటయపడే అవకాశం ఉంది.