ఉదయం 8 గంటల నుంచే పరీక్షా కేంద్రాలకు చేరుకున్న అభ్యర్థులు
ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసిన అధికారులు
పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన అడిషనల్
కలెక్టర్ ముజామ్మిల్‌ఖాన్, విద్యాశాఖ అధికారులు
పేపర్-1కు 93.23 శాతం మంది హాజరు
పేపర్-2కు 93.19% మంది ..
జిల్లావ్యాప్తంగా ఆదివారం టెట్ పరీక్ష సజావుగా ముగిసింది. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 42 కేంద్రాల్లో పేపర్-1 పరీక్షకు 10,019 మంది అభ్యర్థులకు 9,341 మంది హాజరయ్యారు. 93.23 శాతం హాజరు నమోదైంది. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 34 కేంద్రాల్లో పేపర్-2 పరీక్షకు 7,816 మంది అభ్యర్థులకు 7,284 మంది హాజరయ్యారు. 93.19 శాతం హాజరు నమోదైంది. అధికారులు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు.
సిద్దిపేట అర్బన్/కొండపాక, జూన్ 12 : జిల్లా వ్యాప్తంగా ఆదివారం జరిగిన టెట్ పరీక్ష సజావుగా ముగిసింది. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 42 పరీక్షా కేంద్రాల్లో జరిగిన పేపర్-1 పరీక్షకు 10,019 మంది అభ్యర్థులకు గాను 9,341 హాజరయ్యారు. 678 మంది గైర్హాజరు కాగా, 93.23 హాజరు శాతం నమోదైంది. మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 34 పరీక్షా కేంద్రాల్లోజరిగిన పేపర్-2 పరీక్షకు 7,816 మంది అభ్యర్థులకు గాను 7,284 మంది హాజరయ్యారు. 532 మంది గైర్హాజరు కాగా, 93.19 హాజరు శాతం నమోదైంది.
అడిషనల్ కలెక్టర్ ముజామ్మిల్‌ఖాన్‌తో పాటు ఇతర అధికారులు పలు పరీక్షా కేంద్రాలను సందర్శించారు. కొంతమంది మహిళా అభ్యర్థులు తమ పిల్లలతో పాటు పరీక్షా కేంద్రానికి రాగా, వారి కుటుంబ సభ్యులకు తమ పిల్లలను అప్పగించి పరీక్షకు హాజరయ్యారు. కొన్ని పరీక్షా కేంద్రాల్లో దివ్యాంగ అభ్యర్థులకు పోలీస్, పరీక్షా సిబ్బంది సహాయం అందించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలోని పరీక్షా కేంద్రాన్ని అదనపు కలెక్టర్ ముజామ్మిల్‌ఖాన్ పరిశీలించారు. పరీక్ష రాస్తున్న అభ్యర్థులు పేపర్, ఓఎంఆర్ షీట్‌ను పరిశీలించారు. పరీక్షకు ఇచ్చిన పేపర్ కోడ్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. పరీక్ష అనంతరం పేపర్ల తరలింపులో ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా కొండపాక ప్రభుత్వ మోడల్ స్కూల్లో పరీక్షా కేంద్రాన్ని అదనపు కలెక్టర్ ముజామ్మిల్‌ఖాన్ పరిశీలించారు.