ఉదయం 8 గంటల నుంచే పరీక్ష కేంద్రాలకు చేరుకున్న అభ్యర్థులు
మెదక్‌లో 13,242 మంది, సంగారెడ్డిలో 15,523 మంది హాజరు
ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేసిన అధికారులు
పలుచోట్ల చంటి పిల్లలతో వచ్చిన మహిళలు
సెంటర్లను తనిఖీ చేసిన జిల్లా విద్యాధికారులు, అదనపు కలెక్టర్లు
సంగారెడ్డి/ మెదక్ మున్సిపాలిటీ, జూన్ 12: టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. ఉదయం 8 గంటల నుంచే పరీక్షా కేంద్రాల వద్ద అభ్యర్థుల సందడి కనిపించింది. ఉదయం 9:30 గంటలకు ప్రారంభమైన మొదటి పరీక్ష, మధ్యాహ్నం 2:30 జరిగిన రెండో పరీక్ష కొనసాగింది. పరీక్ష కోసం సంగారెడ్డి జిల్లా నుంచి మొత్తం 16,790 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లాలో 70 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా, 15,523 మంది అభ్యర్థులు హాజరైనట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు.
సంగారెడ్డి అదనపు కలెక్టర్ వీరారెడ్డి పరీక్షా కేంద్రాలను సందర్శించారు. విద్యాధికారి నాంపల్లి రాజేశ్‌లతో పాటు ఆయా కేంద్రాల్లో విధులు నిర్వహించిన ఇన్విజిలేటర్లు అభ్యర్థులకు సూచనలు చేశారు. మెదక్ జిల్లాలో ఉదయం పేపర్-1కు 37, మధ్యాహ్నం పేపర్-2కు 27 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. మొత్తం 14,762 మంది అభ్యర్థులకు గానూ 13,242 మంది హాజరైనట్లు జిల్లా విద్యాశాఖాధికారి రమేశ్‌కుమార్ తెలిపారు. ఇందులో పేపర్-1కు 8,605 మంది అభ్యర్థులకు గానూ 7,779 మంది హాజరుకాగా, పేపర్-2కు 6,157 మంది అభ్యర్థులకు గానూ 5,463 మంది హాజరయ్యారు. జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ జిల్లా కేంద్రంలోని పరీక్షా కేంద్రాన్ని సందర్శించారు. కాగా, పరీక్ష రాసేందుకు అభ్యర్థులు చంటిపిల్లలతో రాగా, పరీక్షా సమయంలో కుటుంబ సభ్యులు ఆ చిన్నారులతో కేంద్రాల బయట, చెట్ల నీడలో సేదతీరిన దృశ్యాలు కనిపించాయి. జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో పరీక్షలు రాసే అభ్యర్థులు, సహకులతో హోటళ్లు, టిఫిన్ సెంటర్లు కళకళలాడాయి.