సిద్దిపేట/సిద్దిపేట అర్బన్, జూలై 29: సిద్దిపేట జిల్లా కేంద్రంలో రేషన్ కార్డుల పంపిణీ పోలీస్ పహారాలో జరిగింది. సిద్దిపేట పట్టణంలోని కొండ భూదేవి గార్డెన్లో మంగళవారం సిద్దిపేట అర్బన్, సిద్దిపేట రూరల్, సిద్దిపేట పట్టణంలోని రేషన్ కార్డు లబ్ధిదారులకు రేషన్ కార్డులు, కల్యాణలక్ష్మి చెకులను రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, గనుల శాఖ మంత్రి వెంకటస్వామి, ఎస్సీ , ఎస్టీ కమిషన్ చైర్మన్ బకి వెంకటయ్య, సిద్దిపేట కలెక్టర్ హైమావతి, అదనపు కలెక్టర్ గరిమాఅగర్వాల్, సిద్దిపేట మున్సిపల్ చైర్ పర్సన్ మంజులారాజనర్సుతో కలిసి పంపిణీ చేశారు.
రేషన్ కార్డుల పంపిణీ జరుగుతున్న సమయంలో వేదిక పైకి ఆహ్వానించేటప్పుడు బీఆర్ఎస్,కాంగ్రెస్ నాయకుల మధ్య ప్రొటోకాల్‌కు సంబంధించి కొద్దిసేపు సల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది.కాంగ్రెస్ నాయకులను వేదికపైకి పంపించి, ప్రజాప్రతినిధులైన మమ్మల్ని ఎందుకు పంపించడం లేదని కౌన్సిలర్లు నిలదీశారు. దీంతో పోలీసులు స్థానిక కౌన్సిలర్లను వేదికపైకి పంపారు.ఇన్చార్జి పోలీస్ కమిషనర్ రాజేష్‌చంద్ర ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఎలాంటి ప్రొటోకాల్ లేని కాంగ్రెస్ సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి హరికృష్ణతోపాటు, కాంగ్రెస్ నాయకులు వేదికపైకి ఎక్కికూర్చున్నారు. అధికారులు ప్రొటోకాల్ పాటించకపోవడంపై పలువురు అసహనం వ్యక్తం చేశారు. మంత్రి వివేక్ మాట్లాడుతున్న సమయంలో ప్రజల నుంచి స్పందన కరువైంది. మంత్రి అడిగి చప్పట్లు కొట్టించుకున్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ మాట్లాడుతున్న సమయంలో కాంగ్రెస్ నాయకులు సీఎం జిందాబాద్ అంటూ నినాదాలు చేయగా, మున్సిపల్ చైర్పర్సన్ తన ప్రసంగాన్ని ముగిస్తూ జై హరీశ్ అన్న, జై బీఆర్ఎస్ అంటూ నినాదంతో బదులిచ్చారు.
పోలీస్ పహారాలో కార్డులు, చెకుల పంపిణీ
సిద్దిపేట పట్టణంలోని కొండ మల్లయ్యగార్డెన్లో జరిగిన రేషన్ కార్డులు, కల్యాణ లక్ష్మి,షాదీముబారక్ చెకుల పంపిణీ పోలీసుల భారీ బందోబస్తు మధ్య జరిగింది. మంత్రి వివేక్ వేదికపై ఉన్నప్పుడు వేదిక చుట్టూ పోలీసులు వలయంగా ఏర్పడి ఎవరినీ పైకి ఎక్కనీయలేదు. లబ్ధిదారులను మాత్రమే వేదికపైకి పంపించారు.