సిద్దిపేటరూరల్/ మునిపల్లి., మే 14: జిల్లాలో సూరీడు మండిపడ్డాడు. ఎండలు జనాలను ఠారెత్తిస్తున్నాయి. ఆదివారం సిద్దిపేటలో 41, దుబ్బాకలో 41, గజ్వేల్‌లో
39, హుస్నాబాద్‌లో 41 డిగ్రీల ఉష్ణోగ్రత్తలు నమోదయ్యాయి. ఉక్కపోతతో బయటకు వెళ్లాలంటేనే జనం అల్లాడిపోయారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వేడిగాలితో జనం భయాందోళన చెందుతున్నారు. సాయంత్రం ఏడు తర్వాత చల్లటి గాలులు వీస్తుండడంతో కాసింత ఊరట లభిస్తోంది. మరో పదిహేనురోజులు ఎండలు మరింత దంచికొట్టనున్నాయి. ఎండ వేడిని తట్టుకోలేక పల్లె, పట్టణాల ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇంటిపట్టునే ఉంటున్నారు. ఇదే నెలలో శుభముహుర్తాలు ఉండడం..శుభకార్యాలకు వెళ్లే వారు ఇబ్బందులు పడుతున్నారు. మధ్యాహ్నం 41 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో వేడి ఎక్కువగా ఉంటోంది. వడ దెబ్బ తగులకుండా ప్రజలు ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఉదయం, సాయంత్రం ప్రయాణాలు సాగించాలని వైద్యులు సూచిస్తున్నారు. వరి కోతలు ముగియడంతో రైతులు, రైతు కూలీలకు ఎండలతో ఊరట దొరికింది.
వడదెబ్బ నుంచి రక్షించుకోవాలి
వడదెబ్బబారిన పడకుండా ప్రజలు తమను తాము రక్షించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. శరీరంలో ఉష్ణోగ్రత పెరగకుండా చూసుకోవాలని చెబుతున్నారు. వేడి వాతావరణం తట్టుకోలేని వారు బయటకు వెళ్లకుండా ఇంటిదగ్గరే ఉండాలని సలహా ఇస్తున్నారు. ముఖ్యంగా కలుషిత ఆహారానికి దూరంగా ఉండాలని, సాధ్యమైనంత వరకు నీడపట్టున ఉండాలని చెబుతున్నారు.
పొంచి ఉన్న వ్యాధులు
ఎండలు ముదురుతున్నాయి. పిల్లల ఆరోగ్య సంరక్షణపై జాగ్రత్తలు తీసుకోని పక్షంలో ఇబ్బందుల పాలయ్యే అవకాశం ఉంది.పిల్లలతో పాటు పెద్దలు కూడా ఎండల వల్ల అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది. ఎండలో తిరగడం వల్ల వడదెబ్బకు గురవుతారు. ఆకస్మికంగా పెరిగే ఉష్ణోగ్రత వల్ల జ్వరం బారిన పడతారు. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండే పిల్లలకు చికెన్‌పాక్స్ సోకుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కల్తీనూనె,కలుషిత నీటి వల్ల పచ్చకామెర్లు, డయేరియా వంటి వ్యాధులు ప్రబలుతాయి. ఎండకాలంలో హిటోపెరాక్సియా జ్వరం ఎక్కువగా ప్రబలుతుందని వైద్య నిపుణులు చెబుతున్నా రు. వేసవిలో వడగాలులు తీవ్రంగా వీస్తాయి. ఈ కారణంగా జ్వరం బారిన పడే అవకాశంఎక్కువగా ఉంటుంది.
హిట్ పెరాక్సియా లక్షణాలు
ఒంట్లో ఆకస్మికంగా ఉష్ణోగ్రత పెరగడం వల్ల జ్వరం వస్తుంది. కండ్లు మండడం తలనొప్పి..తల తిరగడం, మూత్రంలో మంట వంటి లక్షణాలు కనిపిస్తాయి.
పచ్చకామెర్లు…
కల్తీ నూనె, కలుషిత నీరు, ఆహారం వల్ల పచ్చకామెర్ల వ్యాధి బారిన పడతారు. కల్తీ నూనెలతో తయారు చేసిన వంటకాలను తినడం, అపరిశుభ్రంగా ఉన్న హోటళ్లు, ఫాస్ట్‌పుడ్ సెంటర్లలోని ఆహార పదార్థాలు తినడం వల్ల పచ్చకామెర్ల వ్యాధి వస్తుంది. తద్వారా కలేయం దెబ్బతిని ఆకలి సన్నగిల్లుతుంది. ఈ వ్యాధి బారిన పడిన వెంటనే చికిత్స చేయించుకోవాలి లేకపోతే ఒక్కోసారి ప్రాణాపాయ స్థితి కూడా ఏర్పడవచ్చు.
అతిసార వ్యాధి
వేసవిలో అతిసార వ్యాధి కూడా తీవ్రంగా ప్రబలే అవకాశం ఉంది. ఆహార పదార్థాలు, నీరు కలుషితం కావడం వల్ల అతిసార వ్యాధి బారిన పడే అవకాశం ఉంది. బ్యాక్టీరియా, ఫంగస్ కారణంగా ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఉంది.
పిల్లలు జాగ్రత్త
వేసవి సెలవులు కావడంతో చిన్నారులు బయటకు వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి. వేసవి తాపాన్ని తట్టుకునేందుకు చిన్నారులు ప్రమాదాల బారినపడే అవకాశం ఉంది. ఈత కోసం గ్రామానికి సమీపంలోని చెరువులు, బావుల వద్దకు వెళ్లి ప్రాణాల మీదికి కొనితెచ్చుకోవచ్చని, పిల్లలను గమనిస్తూ ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
జాగ్రత్తలు ఇవే..
ఎండలు దంచికొడుతున్నాయి
ఆదివారం హైదరాబాద్ వెళ్లాల్సి ఉండేది. ఎండలు దంచికొడుతున్నాయి. ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటే భయంగా ఉంది. మొన్నటి వరకు అప్పుడప్పుడు వాన పడేది. ఇప్పుడు ఎండ కొడుతోంది. వడదెబ్బ తగిలితే తట్టుకోలేం. కాబట్టి ఇంటి పట్టునే ఉండేందుకు నిశ్చయించుకున్నా. ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సి వస్తోంది. ఎండలో దూర ప్రయాణం చేయడం కష్టం.
– భూంరెడ్డి, న్యాయవాది, సిద్దిపేట
నీడపట్టున ఉంటే మంచిది
ఎండలకు ప్రజలు నీడపట్టున ఉంటే మంచిది. పట్టణాలకు వెళ్లే వారు ఉదయమే పని ముగించుకొని ఇంటికి చేరుకోవాలి. నీటిని ఎక్కువగా తాగాలి. అవసరమైన వారికి పుల్లూరు పీహెచ్సీలో తగిన మందులు అందుబాటులో ఉన్నాయి.
– డాక్టర్ ఉదయ్‌కుమార్, పుల్లూరు పీహెచ్సీ
బయటకు వెళ్లడం లేదు
ఎండలకు ఎక్కడికీ వెళ్లడం లేదు. ఉష్ణోగ్రతలు పెరిగాయి. వడదెబ్బతో ఇబ్బందులు తప్పవు. అందుకే దూర ప్రయాణాలకు వెళ్లడం లేదు. అత్యవసరం అయితే తప్ప సిద్దిపేటకు వెళ్లడం లేదు. పని ఉంటే ఉదయం లేదా సాయంత్రం వెళ్లి వస్తున్నాం.
– బైతి శేఖర్, బుస్సాపూర్ గ్రామం, సిద్దిపేట మండలం