సంగారెడ్డి కలెక్టరేట్, ఏప్రిల్ 23: ఎప్పడెప్పుడా అని ఎదురుచూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి. ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం వేసవి సెలవులను ప్రకటించింది. ఈనెల 24 నుంచి జూన్ 12 వరకు వేసవి సెలవులు కొనసాగనున్నాయి. బుధవారం పాఠశాలలకు చివరి పని దినం కావడంతో విద్యార్థుల సంతోషానికి అవధులు లేవు. స్టేట్, సెంట్రల్ సిలబస్‌కు సంబంధించిన పరీక్షలన్నీ ఇప్పటికే పూర్తయ్యాయి.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వసతి గృహాలన్నీ మూత పడ్డాయి. హాస్టళ్లలో ఇన్నాళ్లు ఉన్న విద్యార్థులు తమ ట్రంకు పెట్టెలు, బ్యాగులతో ఇంటిబాట పట్టారు. జూన్ 13న పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. వేసవి సెలవుల్లో విద్యార్థులు ఎండలో తిరగవద్దని, ముఖ్యంగా చెరువులు, కుంటలు, బావుల వద్దకు సరదాగా వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని విద్యాశాఖ అధికారులు సూచిస్తున్నారు. తమ పిల్లలను తల్లిదండ్రులు కనిపెడుతూ ఉండాలని సూచించారు.