సిద్దిపేట టౌన్, ఏప్రిల్ 8: నందిని సిధారెడ్డి కథల్లో తెలంగాణ జీవితం ప్రస్ఫుటంగా కనిపిస్తుందని ప్రముఖ సంపాదకుడు, రచయిత కె.శ్రీనివాస్ అన్నారు. సిధారెడ్డి రచించిన బందారం కథల పుస్తకాన్ని సిద్దిపేట ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం రాత్రి ఆవిష్కరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కె.శ్రీనివాస్ హాజరై మాట్లాడుతూ.. రెండు దశాబ్దాల నుంచి తెలంగాణ కథా సాహిత్యం వెనకబడి పోయిందన్నారు.గ్రామీణ ప్రాంతాల నుంచి కథలు వస్తే పల్లె బతుకుల గుండె ఆవిష్కరణ అవుతుందన్నారు.
సిధారెడ్డి పీడిత పక్షపాతి అని, ఆయన సాహిత్యంలో మానవీయ సంబంధాలు ఉండవన్నారు. బందారం కథల పుస్తకం సాహిత్య చరిత్రలో నిలబడుతుందని ఆకాంక్షించారు. పల్లె జీవితాల్లో జీవన వైరుధ్యాలను ఈ పుస్తకంలో చక్కగా ఆవిష్కరించారన్నారు. తెలుగు సాహిత్యానికి వ్యవసాయ జీవితాన్ని సిధారెడ్డి అద్భుతంగా అద్దారని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ కొనియాడారు.
ఆయన సాహిత్యంలో రైతు సంతకం కనిపిస్తుందన్నారు. గ్రామీణ జీవితం సిద్ధారెడ్డి బలమని, ఆయన సాహిత్యంలో పల్లె మూలాలు స్పష్టంగా కనిపిస్తాయని చెప్పారు. రచయిత, తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి అధ్యక్షుడు నందిని సిధారెడ్డి మాట్లాడుతూ..పల్లె జీవితం తన సాహిత్యానికి దిక్సూచి అన్నారు.అంతకు ముందు సభలో మంజీరా రచయితల సంఘం అధ్యక్షుడు రంగాచారి, కవులు బాలయ్య, భగవాన్‌రెడ్డి, అంజయ్య, యాదగిరి మాట్లాడుతూ.. సిధారెడ్డి కథల్లో తెలంగాణ జీవితం ఇమిడి పోయిందని అన్నారు.కార్యక్రమంలో కవులు, రచయితలు సాహితీ ప్రియులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.