సంగారెడ్డి, ఫిబ్రవరి 4(నమస్తే తెలంగాణ) : కేంద్ర బడ్జెట్ బాగాలేదని, బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని సీపీ ఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చుక్కరాములు అన్నారు. మంగళవారం సంగారెడ్డిలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మోదీ పాలనలో ప్రజల తలసరి ఆదాయం తగ్గిందని, ద్రవ్యోల్బలం విపరీతంగా పెరిందన్నారు. తెలంగాణ నుంచి ఎనిమిది మంది బీజేపీ ఎంపీలను గెలిపించినా బడ్జెట్లో నిధు లు కేటాయించలేదన్నారు. రైల్వేబడ్జెట్లోనూ తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. విభజన చట్టంలోని ఏ ఒక్క హామీని మోదీ సర్కార్ నెరవేర్చడం లేదన్నారు.
రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన సీపీఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ప్రజాపోరాటాలు చేయనున్నట్లు చెప్పారు. ప్రజాపాలనను అం దించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు నెరవేర్చేలా సీపీఎం పోరాటం చేస్తుందని చుక్క రాములు పేర్కొన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా మీనమేషాలు లెక్కించడం తగదన్నారు. ఏ పార్టీ గుర్తుపై ఎమ్మెల్యేలు గెలిచారో అదే పార్టీలో ఉండాలన్నారు. పార్టీలు ఫిరాయించటం సరికాదన్నారు.
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ వెంటనే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్పీకర్ వెంటనే రాజ్యాంగపరంగా నిష్పక్షపాతమైన చర్యలు తీసుకుని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని కోరారు. ఒక పార్టీ గుర్తుపై గెలుపొంది మరోపార్టీలో చేరడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే అన్నారు. ప్రజలు ఎంతో నమ్మకంతో గెలిపిస్తే ఎమ్మెల్యేలు తమ స్వప్రయోజనాల కోసం పార్టీలు మారడం సరికాదని, వారిపై చర్యలు తీసుకుని ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని రక్షించాల్సిన అవసరం ఉందన్నారు. మోదీ ప్రభుత్వం పెట్టుబడిదారులకు తొత్తుగా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. మోదీ ప్రజల కోసం కాకుండా పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారని ఆరోపించారు. విలేకరుల సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి జయరాజు, నాయకులు బి.మల్లేశం, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.