మెదక్, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ): గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈనెల 22న మెదక్ జిల్లాలో పర్యటించనున్నారని కలెక్టర్ రాహుల్‌రాజ్ తెలిపారు. మెదక్ చర్చితోపాటు కొల్చారం మండలంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలలో విద్యార్థినులతో ముఖాముఖి నిర్వహించనున్నారని తెలిపారు.
మెదక్ చర్చిలో ముందస్తు ఏర్పాట్ల కోసం మెదక్ ఆర్డీవో రమాదేవి, తహసీల్దార్ లక్ష్మణ్‌బాబు, చర్చి ప్రెసిడెంట్ శాంతయ్య, సెక్రెటరీ బోనితో కలిసి కలెక్టర్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రూట్ మ్యాప్, పారింగ్, చర్చి ఆవరణలో ఏర్పాట్లపై చర్చి నిర్వాహకులు, అధికారులతో చర్చించారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. మెదక్ చర్చి ఈనెల 25 వరకు వందేండ్లు పూర్తి చేసుకుంటుందన్నారు. జిల్లాలో ఉన్నతాధికారులు, పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుందన్నారు. 22న గవర్నర్ పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లలో లోటుపాట్లు కలగకుండా చర్యలు చేపట్టామని చెప్పారు.