వెల్దుర్తి, డిసెంబర్ 7: బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించిన ప్రభుత్వం ఆటోడ్రైవర్ల పొట్టకొడుతున్నదని ఆటోడ్రైవర్ల సంఘం మండల అధ్యక్షుడు భాషాగౌడ్, ఉపాధ్యక్షుడు షాబొద్దీన్ మండిపడ్డారు. బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిండాన్ని నిరసిస్తూ శనివారం వెల్దుర్తితో పాటు మండలంలోని పలు గ్రామాల్లో ఆటోడ్రైవర్లు ఆటోలు నిలిపేసి, ధర్నా చేశారు. ధర్నాలో ఆటో డ్రైవర్లు ప్రవీణ్, బాలేశ్, మహిపాల్, గోపాల్, రమేశ్, అనిల్, మహేశ్, నరేశ్, శ్రీను, శేఖర్ పాల్గొన్నారు.
బెజ్జంకి, డిసెంబర్ 7: ప్రభుత్వం ఆటోడ్రైవర్లకు ఇచ్చిన హామీ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బెజ్జంకి ఆటో యూనియన్ ఆధ్వర్యంలో బంధు పాటించి, అంబేద్కర్ చౌరస్తాలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మహిళలకు ఉచిత బస్సు ఏర్పాటుతో ఆటోడ్రైవర్లు రోడ్డున పడ్డారని, వారికి ప్రభుత్వం నెలకు రూ.12 వేలు ఇస్తామని చెప్పి నెలలు గడుస్తున్నా ఆటోడ్రైవర్ల దీనస్థితిని పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీరుతో ఆటోడ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందన్నారు. ప్రభుత్వం స్పందించి ఆటోడ్రైవర్ల సమస్యలను పరిష్కరించి న్యాయం చేయాలని కోరారు.