సిద్దిపేట, ఆగస్టు 9: పైరవీలు లేకుండా, ఒక రూపాయి కూడా లంచం ఇవ్వకుండానే నిరుపేద ఎస్సీ లబ్ధిదారులకు సహాయం చేస్తున్న బీఆర్ఎస్ సర్కారు సేవలను గుర్తించుకొని, సద్ది తిన్న రేవుని మరువకుండా ప్రభుత్వానికి అండగా ఉండాలని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. బుధవారం మంత్రి క్యాంపు కార్యాలయంలో ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో సిద్దిపేట శాసనసభ నియోజకవర్గానికి సంబంధించిన 265 మంది ఎస్సీ లబ్ధిదారులకు రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్ సభ్యులు పాల సాయిరాం, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డిలతో కలిసి ప్రొసీడింగ్ పత్రాలను మంత్రి అందజేశారు.
అంతకు ముందు ప్రజాగాయకుడు గద్దర్ మృతికి సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా జిల్లాలో 1550 మంది లబ్ధిదారులకు రూ.36కోట్ల 75 లక్షల సబ్సిడీని అందజేశామన్నారు. ఈరోజు సిద్దిపేట నియోజకవర్గానికి చెందిన 265 మందికి రూ.5 కోట్ల 46 లక్షలను పంపిణీ చేశామన్నారు. మిగతా నియోజకవర్గాల్లో కూడా త్వరలోనే పంపిణీ చేస్తామన్నారు. దళిత బంధు ద్వారా రూ.10 లక్షలు ఇస్తూనే, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి రుణాలు, టీ ప్రైడ్ ద్వారా రుణాలు, పిల్లల చదువులకు రెసిడెన్షియల్ విద్యాలయాల ఏర్పాటు చేశామన్నారు. దళిత విద్యార్థుల విదేశీ చదువుల కోసం రూ. 20 లక్షల రుణం అంబేదర్ ఓవర్సీస్ కింద ఇస్తున్నట్లు తెలిపారు. బిడ్డ కడుపున పడగానే న్యూట్రీషన్ కిట్, బిడ్డపుట్టగానే కేసీఆర్ కిట్ అంగన్వాడీ ద్వారా పౌష్టికాహారం, ప్రీ ప్రైమరీ విద్య, కల్యాణ లక్ష్మి ద్వారా రూ.1లక్ష 116లు సాయం చేయడంతో పాటు రూ. 2000 ఆసరా పింఛన్లు, ఆరోగ్యశ్రీ ద్వారా రూ.5 లక్షల వరకు ఉచిత ఆపరేషన్లు, వ్యవసాయానికి 24 గంటలు ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా అందిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పథకాలను మీరంతా సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చెంది సద్ది తిన్న రేవుని మరువకుండా మీ నుంచి వచ్చే ఆత్మీయ పలకరింపే మాకు ముఖ్యమన్నారు.