శివ్వంపేట, మార్చి 21: గ్రామాల్లో పంటలు ఎండిపోయి నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు రూ. 30వేల చొప్పున పంటనష్ట పరిహారం ప్రభుత్వం చెల్లించాలని తెలంగాణ రైతురక్షణ సమితి మెదక్ జిల్లా గౌరవాధ్యక్షుడు అక్కమొల్ల మైసయ్య యాదవ్ డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా శివ్వంపేట మండలం పాంబండ, ఉసిరికపల్లి, శంకర్ తండాల్లో ఎండిన పంటపొలాలను శుక్రవారం తెలంగాణ రైతురక్షణ సమితి సభ్యులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మార్చి నుంచే పంటలు ఎండుముఖం పట్టడం బాధాకరమని, మరో నెలరోజుల వరకు పంటలకు నీరు పెట్టాల్సి ఉంటదని, రైతులందరూ ఆందోళనకు గురవుతున్నట్లు తెలిపారు.
అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ఎండిన పంటల వివరాలు సేకరించాలన్నారు. ఏప్రిల్ రెండో వారంలో రైతులకు క్రాప్లోన్కు సంబంధం లేకుండా అదనంగా రూ. లక్ష రుణం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం రైతుల పంటకు బీమా కట్టకపోవడంతో రైతులకు నష్టం జరుగుతున్నదని, రైతులకు ఆశచూపి అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ మరిచిపోవడం విడ్డూరంగా ఉందన్నారు. రైతుభరోసా, రుణమాఫీ పూర్తిస్థాయిలో అమలు చేయకపోవడం సిగ్గుచేటన్నారు. రైతుల పక్షాన రాబోయే రోజుల్లో రోడ్లపై వంటావార్పు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో రైతురక్షణ సమితి జిల్లా ఉపాధ్యక్షుడు అంతంగారి వెంకటేశం, జిల్లా ప్రధాన కార్యదర్శి మామిడి నర్సారెడ్డి, రైతులు ఉన్నారు.
నాకున్న నాలుగెకరాల్లో దాదాపు లక్షా 20వేల రూపాయల అప్పు తెచ్చి వరిపంట వేశాను. వేసిన పంట మొత్తం ఎండిపోయింది. నా పంటను చూస్తే పొలానికి కూడా రాబుద్ది కావడం లేదు. పంటను కాపాడుకోవాలని రూ. 2 లక్షల అప్పులు చేసి మూడు బోర్లు వేయించినా చుక్కనీరు పడలేదు. మొత్తం అప్పులపాలైన. పెండ్లాం, పిల్లలు బతకడానికే కష్టమైంది. ప్రతిసారి పంట వేసుకున్న, కానీ ఎప్పుడూ ఎండిపోలే. కాంగ్రెస్ సర్కార్ నాకు రైతుబంధు పైసల్ వేయలేదు. రుణమాఫీ కాలేదు. సర్కార్ నన్ను ఆదుకోవాలి.
-నాగనొల్ల మల్లయ్య, రైతు, పాంబండ