పటాన్చెరు రూరల్, జూలై 7: జస్టిన్ ఒక్కసారి కనిపించిపోరా అంటూ అతడి తండ్రి రాందాస్ విలపిస్తున్నాడు. కుమారుడి జ్ఞాపకాలతో వారం రోజులుగా ఏడుస్తూనే ఉన్నాడు. మీరిచ్చే నష్టపరిహారం వద్దు.. నా జస్టిన్ను నాకివ్వండి అంటూ అధికారులను కోరుతున్నాడు. అతడి ఆవేదనను అర్థం చేసుకున్న అధికారులు ఓదార్చి పంపిస్తున్నారు తప్పా జస్టిన్ను మాత్రం వెతికి తేలేకపోతున్నారు. డ్యూటీ దొరికింది నాన్న అంటూ బండ్లగూడ నుంచి సంగారెడ్డి జిల్లా పాశమైలారం సిగాచికి వచ్చిన జస్టిన్ కేవలం రెండు రోజులు మాత్రమే విధులకు హాజరయ్యాడు. శనివారం డ్యూటీ చేశాడు, ఆదివారం సెలవు, సోమవారం విధులకు వచ్చి సిగాచిలో జరిగిన పేలుడులో గల్లంతయ్యాడు.
అందరితో కలగొలుపుగా ఉంటూ ప్రేమాభిమానాలు చాటే జస్టిన్ కనిపించకపోవడంతో అతడి బంధువులతో పాటు మిత్రులు కూడా 50-60 మంది హెల్ప్‌డెస్క్ వద్ద పడిగాపులు పడుతున్నారు. ప్రభుత్వం 42 మంది మృతిచెందినట్లు అధికారికంగా ప్రకటించింది. ఎనిమిది మంది గల్లంతైనట్లు తేల్చింది. గల్లంతైనవారు దవాఖానలోనూ లేరు. ఆచూకీ కూడా ఎక్కడా లభించడం లేదు. పరిశ్రమలోనే అసువులు భాసినట్లుగా భావిస్తున్నారు. మరోపక్క పలు దవాఖానల్లో తీవ్రగాయాలతో పలువురు కార్మికులు చికిత్స పొందుతున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. మరికొద్ది రోజులు గడిస్తేకానీ ఎంతమంది మృతి చెందారనేది లెక్కతేలుతుంది.
సిగాచి పరిశ్రమకు మంగళవారం నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (ఎన్డీఎంఏ) బృందం రానున్నది. సోమవారం జిల్లా అధికారులు ఈ వివరాలు వెల్లడించారు. ఈ నెల 30న పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచి పరిశ్రమలో భారీ పేలుడు సంభవించి 42మంది కార్మికులు, సిబ్బంది మృతిచెందారు. దుర్ఘటన తర్వాత ఎనిమిది మంది కార్మికులు కనిపించడం లేదు. మరికొందరు దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. ఈ దుర్ఘటనకు గల కారణాలను ఐదుగురు సభ్యు లు కలిగిన ఎన్డీఎం బృందం అధ్యయనం చేస్తుంది. పరిశ్రమలో పేలుడుకు గల కారణాలపై ఎస్‌డీఎంఏతో కలిసి ఈ నెల11 వరకు విచారణ చేయను న్నది. ప్రమాదానికి గల కారణాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదికలు ఇస్తారు. ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుం డా ఎలాంటి చర్యలు తీసుకోవాలో సూచనలు ఇస్తారు. ఇప్పటికే ఘటనా స్థలాన్ని భద్ర నిపుణుల కమిటీ, సీఎస్ ఆధ్వర్యంలో వచ్చిన హైలెవల్ కమిటీలు పరిశీలించాయి.