పటాన్చెరు రూరల్, జూలై 13 : యాజమాన్యం నిర్లక్ష్యంతోనే సిగాచి పరిశ్రమలో భారీ ప్రమాదం చోటుచేసుకుందని, యాజమాన్యంపై హత్యకేసు నమోదు చేయించి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ పౌర సమాజం ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఆదివారం పటాన్చెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచి పరిశ్రమను తెలంగాణ పౌర సమాజం ప్రతినిధులు పరిశీలించారు ఈ సందర్భంగా కంపెనీ ప్రమాదంలో గల్లంతైన కార్మికుల కుటుంబాలను కలిసి వివరాలు సేకరించారు. మరణించిన కార్మికుల కుటుంబాలను కలిశారు.
గాయపడి చికిత్స పొందుతున్న కుటుంబాలను పటాన్చెరులో దవాఖానల్లో కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పౌర సమాజ ప్రతినిధుల బృందం సిగాచి ప్రమాదంపై, తరువాత పరిణామాలపై నిజనిర్ధారణ చేసింది. బృందానికి సైంటిస్ట్ ఫర్ పీపుల్ సంస్థ వ్యవస్థాపక సభ్యులు, సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ కలపాల బాబురావు నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం సిగాచి ప్రమాదం నుంచి ఏమి నేర్చుకోలేదన్నారు. హైలెవెల్ కమిటీని, నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిందని, ఏ కమిటీ ఇంతవరకు గాయపడిన వారిని కాని, ప్రమాదం నుంచి తప్పించుకున్న వారిని విచారించలేదన్నారు. ప్రమాదం దుర్ఘటనపై ఇంతవరకు ఎంతమంది చనిపోయారు.
ఎంతమంది గాయపడ్డారు, ఎంతమంది గల్లంతయ్యారో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేయలేదన్నారు. ప్రమాదంపై సంపూర్ణ వివరాలతో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గల్లంతైన కార్మికుల కుటుంబాలకు డెత్ సర్టిఫికెట్ తక్షణమే ఇవ్వాలని సూచించారు. మరణించిన కార్మికుల, సిబ్బంది కుటుంబాలకు ఉచిత విద్యను అందజేయాలన్నారు. సిగాచి పరిశ్రమలో అత్యధికులు క్యాజువల్ కార్మికులే ఉన్నారని, కాంట్రాక్ట్ లేబర్‌గా ఉన్నారని వివరించారు. కొద్దిమంది మాత్రమే పర్మినెంట్ కార్మికులు ఉన్నారన్నారు. 12గంటల డ్యూటీని సిగాచి అమలు చేస్తున్నదని, కార్మికులకు ప్రకటించిన నష్టపరిహారం పూర్తిగా చెల్లించాలన్నారు.
సిగాచిలో జూన్ 30న తొలి పేలుడు ప్రొడక్షన్ బ్లాక్‌లోని స్ప్రే డైయర్లో జరిగిందని, పేలుడు తీవ్రతకు ఆ భవనంలో పేరుకుని పోయిన ఎంసీసీ (ధూళి ) గాలిలోని లేచి అంటుకుని రెండో పేలుడుకు దారితీసిందని బృందం వెల్లడించింది. రెండో పేలుడు చాలా పెద్దదని, దాని విధ్వాంసానికి స్లాబ్‌లు కూలిపోయినట్లు చెప్పారు. ప్రాణనష్టం సంభించిందన్నారు. 35 ఏండ్లుగా ప్రమాదరహితంగా పరిశ్రమ నడుస్తున్నదని యజమాన్యం చెబుతున్నదని, కానీ.. ప్రమాదం జరుగుతుందని యజమాన్యం కాని, భద్రత అధికారులు కాని ధూళి గురించి ఆలోచించలేదన్నారు. సులభ వ్యాపార విధానాలకు భద్రత అడ్డంకిగా భావించి నిర్లక్ష్యం చేశారన్నారు. భద్రత అధికారుల నైపుణ్య లోపం, భద్రతలో నిర్లక్ష్యంగా స్పష్టంగా కనిపించిందన్నారు. ధూళి ద్వారా పేలుళ్లు దేశంలో చాలా చోట్ల జరుగుతున్నా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ వైపుగా దర్యాప్తు చేయట్లేదన్నారు.
బ్యూరోక్రాట్లను ఈ విచారణ కమిటీల్లో వేయడం వల్ల ప్రయోజనం ఉండదన్నారు. భద్రతపై సుదీర్ఘ అనుభవం ఉన్న నిపుణులతో కమిటీ వేసి ధూళితో ఏర్పడే భద్రతపై విచారణ చేయించాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర హైకోర్ట్టు సీనియర్ న్యాయవాది, మానవ హక్కుల వేదిక నాయకులు వసుధా నాగరాజు, తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ కన్నెగంటి రవి, రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్.వెంకట్‌రెడ్డి, వై.అశోక్‌కుమార్, అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ ఉస్మాన్, నాయకులు మజీద్, ప్రజా ఉద్యమాల జాతీయ వేది రాష్ట్ర కన్వీనర్ మీరా సంఘమిత్ర, ఎన్‌ఎపీఎం నాయకుల అఖిల్ సూర్య సంగారెడ్డి జిల్లా టీపీజేఏసీ నాయకులు జనార్దన్, పాత్రికేయులు రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.