మెదక్ జిల్లా టేక్మాల్ ఎస్సై రాజేశ్ లంచం తీసుకుంటూ మంగళవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. వరి కోత యంత్రానికి సంబంధించి బ్యాటరీ చోరీ కేసు మాఫీకి ఓ వ్యక్తి నుంచి ఎస్సై రూ.40 వేలు డిమాండ్ చేయగా, ఈనెల 13న ఫోన్‌పే ద్వారా రూ. 10వేలు చెల్లించాడు. మంగళవారం రూ. 30 వేల లంచం డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఇదంతా ఓ సినీ పక్కీలా జరిగిందని చెప్పాలి. ఎస్సై గోడ దూకి పారిపోవడంతో ఏసీబీ అధికారులు వెంబడించి పట్టుకోవడం సంచలనం సృష్టించింది. ఏసీబీ దాడుల్లో పట్టుబడిన ఎస్సై రాజేశ్ అవినీతి అంతా ఇంత కాదు. మండలంలో జరిగే ప్రతి వ్యాపారంలో ప్రతి దానికి ఒక రేటు పెట్టి ఇష్టారీతిగా డబ్బులు గుంజేవాడని ప్రజలు బాహాటంగానే చెప్పారు.
ఆ ఎస్సై ఏసీబీకి పట్టుబడడంతో ప్రజలు పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారంటే ఆ ఎస్సై ఎంతగా పీడించాడో అర్ధమవుతున్నది. బెల్ట్‌షాప్‌ల నిర్వాహకుల వద్ద నెలనెలా మామూళ్లు తీసుకునే వాడు. జూదరుల నుంచి, ఇతర వ్యాపార వర్గాల నుంచి, వివిధ కేసుల విషయంలో న్యాయం కోసం స్టేషన్‌కు వచ్చిన వారి నుంచి అందినకాడికి ఎస్సై వసూలు చేసేవాడని తెలిసింది. ఎస్సై తీరుపై విసుగుచెందిన బాధితులు ఏసీబీని ఆశ్రయించారు. గతంలో 2013లో ఇదే టేక్మాల్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించిన ఎస్సై ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. అప్పట్లో కూడా గ్రామస్తులు పోలీస్ స్టేషన్ వద్ద పెద్దఎత్తున పటాకులు కాల్చి సంబురాలు జరుపుకోవడం విశేషం.
జూలై 2024లో మెదక్ జిల్లా హవేళీఘన్‌పూర్ ఎస్సైగా పనిచేసిన ఆనంద్‌కుమార్ పోలీస్ కస్టడీలోని ఇసుక టిప్పర్‌ను వదిలేసేందుకు రూ. 20 వేల డబ్బులు డిమాండ్ చేశాడు. వ్యాపారుల నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
ములుగు ఎస్సై విజయ్‌కుమార్, కానిస్టేబుల్ రాజు ఈనెల 11న కోర్టు ఆదేశాల ప్రకారం ఓ ఇంటి సమస్యను పరిష్కరించడానికి లంచం డిమాండ్ చేసి రూ. 50 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు పట్టుపడ్డారు.
సిద్దిపేట, నవంబర్ 20(నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి మెదక్ జిల్లాలో పోలీసుల వ్యవహార శైలి ఆ శాఖకు మచ్చతెస్తున్నది. కొందరు పోలీసుల తీరుతో రోజురోజుకు పోలీస్‌శాఖ అంటేనే ప్రజలు అసహ్యించుకునే పరిస్థితి ఏర్పడుతున్నది. అన్ని ఠాణాల్లో అవినీతి పెరిగిపోయింది. ఎంత పడితే అంత గుంజేస్తున్నారు. అవినీతికి పాల్పడిన పోలీస్ శాఖ అధికారులు ఏసీబీ దాడుల్లో దొరకడంతో ఏకంగా ఆ స్టేషన్ల ముందే ప్రజలు పటాకులు కాల్చి సంబురాలు చేసుకుంటున్నారంటే ఎంతగా ప్రజలను పోలీసులు పీడిస్తున్నారో ఇట్టే అర్థం అవుతుంది.
పోలీసులు అంటే క్రమశిక్షణకు మారుపేరు, అలాంటి పోలీసులే ఇవాళ అవినీతికి పాల్పడి ఏసీబీ అధికారులకు పట్ట్టుబడుతున్న సంఘటనలు సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో వరుసగా చోటు చేసుకుంటున్నాయి. అక్రమాలను అడ్డుకోవాల్సిన పోలీసులే, అక్రమార్కులకు కొమ్ము కాస్తున్నారన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. కొంత మంది పోలీసులు ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారు. వారివల్ల నిజాయితీగా పని చేసే పోలీసులకు కూడా చెడ్డపేరు వస్తున్నది. క్రమశిక్షణ, నిబద్ధత, నిజాయితీగా విధులు నిర్వహించాలని ప్రతి సమావేశంలో పోలీస్ ఉన్నతాధికారులు ఎంత చెప్పినా పోలీసులలో మార్పు రావడం లేదు. న్యాయం కోసం ఠాణా మెట్టు ఎక్కిన బాధితుల నుంచే డబ్బులు గుంజడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా సెటిల్మెంట్లకు ఠాణాలను అడ్డాగా మార్చారనే ఆరోపణలు వస్తున్నాయి.
ఉమ్మడి మెదక్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఇసుక మాఫియా రెచ్చిపోతున్నది. కొంతమంది పోలీసు అధికారులు వారితో చేతులు కలిపి అందినకాడికి దోచు కుంటున్నారు. మామూళ్లు తీసుకుని ఇసుక మాఫియాకు అండగా నిలుస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అక్రమంగా వచ్చిన సొమ్ముతో విలాసవంతమైన విల్లాలు, ఇతర వ్యాపారాల్లో మునిగి తేలుతున్నట్లు తెలిసింది. ఇటీవల నిర్వహించిన మద్యం టెండర్లలో సైతం కొంతమంది పోలీసులు పాల్గొన్నట్లు సమాచారం. సిండికేట్‌గా ఏర్పడిన గ్యాంగ్‌లో వీరు ఉండి తెరవెనుక అన్ని వ్యవహారాలను చక్కబెడుతున్నారన్న విమర్శలు జిల్లాలో బలంగా ఉన్నాయి.సహజంగా పోలీస్ శాఖ అంటేనే అక్రమ వ్యాపారులు జంకుతారు.
ఆ యూనిఫామ్‌ను అడ్డంగా పెట్టుకొని కొంతమంది పోలీసులు అక్రమ వ్యాపారులను బెదిరించి వారి వ్యాపారంలో భాగస్వాములు అవుతున్నట్లు తెలిసింది. రేషన్ బియ్యం, గంజాయి, బెల్టుషాపులు, జూదాలు, గుట్కాల ఇతరత్రా అక్రమాలు జిల్లాలో యథేచ్ఛగా సాగడానికి పోలీసు శాఖలోని కొందరు అధికారుల అండదండలే కారణమనే ఆరోపణలు ఉన్నా యి. జిల్లాలో అక్కడక్కడ పోలీసులపై ఆరోపణలు రావడంతో కొన్ని చోట్ల విచారణ జరిపి సస్పెండ్ చేసిన ఉదంతాలు ఉన్నాయి. మెదక్ జిల్లా కేంద్రంలో గతేడాది ఓ కేసు విషయంలో డబ్బులు వసూలు చేసిన ఘటనలో ఇద్దరు కానిస్టేబుళ్లు సస్పెన్షన్‌కు గురయ్యారు. అదే ఏడాది అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్‌ను విడిపించేందుకు రూ. 20 వేలు లంచం తీసుకుంటూ పోలీసులు ఏసీబీ దొరికారు. సంగారెడ్డి సీసీఎస్ పోలీస్‌స్టేషన్‌లో పనిచేసిన ఓ సీఐపై ఆరోపణలు రావడంతో సస్పెండ్ అయ్యాడు.
సిద్దిపేట జిల్లా గౌరారం పోలీస్ స్టేషన్ ఎస్సై, ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ ఓ కేసు విషయంలో తలదూర్చి భారీగా డబ్బులు వసూలు చేయడంతో ఆరోపణలు వెల్లువెత్తాయి. ఉన్నతాధికారులు విచారణ జరిపి ఆ ముగ్గురిపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. ఇటీవల సిద్దిపేటలో ఓ కేసు విషయంలో సీఐ భారీగా డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలు వచ్చాయి. ఏసీబీకీ పట్టుబడుతున్నా, సస్పెన్షన్‌కు గురవుతున్నా, ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నా పోలీసుల్లో మార్పు రావడం లేదనే విమర్శలు ఉన్నాయి. కొంతమంది పోలీసులు అధికార పార్టీ నాయకుల అండదండలతో రెచ్చిపోతున్నారు. ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తున్నారు. కేసు ప్రాధాన్యతను బట్టి డబ్బులు వసూలు చేస్తున్నారు. సిద్దిపేట, గజ్వేల్, చేర్యాల, మెదక్, సంగారెడ్డి, పటాన్చెరు, జహీరాబాద్ తదితర పాంతాల్లో పోలీసులు రెచ్చిపోతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.