విద్యార్థులకు దత్తతగా హరితహారం మొక్కలు
6 నుంచి 10వ తరగతి వరకు ఆంగ్లవిద్యా బోధన
పాఠశాలలో 270 మంది విద్యార్థులు
చిత్రలేఖనంలో జాతీయ స్థాయిలో అవార్డులు
మనోహరాబాద్, మార్చి13: తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సర్కారు పాఠశాలల రూపురేఖలు మారిపోయాయి. సీఎం కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలలు నేడు కార్పొరేట్ పాఠశాలలను తలదన్నే విధంగా తయారయ్యాయి. మునపటికంటే ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య, సైన్స్, మ్యాథమెటీక్స్ వంటి ప్రత్యేక బోధనలు చేపడుతుండటంతో విద్యార్థుల సంఖ్య పెరిగింది. గత ప్రభుత్వాల హ యాంలో సర్కారు బడి అంటే చిన్నచూపు చూసేవారు.. నేడు సర్కారు బడుల్లో ఆంగ్లవిద్య బోధనతో తమ పిల్లలన్ని చేర్పించేందుకు పోటీ పడుతున్నారు. మనోహరాబాద్లోని జడ్పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థులకు ఆదర్శంగా నిలిచింది. ఇక్కడి ఉపాధ్యాయులు విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపి వెనుకబడిన విద్యార్థులను మెరుగుగా ఉన్న విద్యార్థులతో సత్సంబధాలు ఏర్పరుస్తు పిల్లలను ఆదర్శ విద్యార్థులుగా తీర్చిదిద్దుతున్నారు. దీంతో ఈ పాఠశాలకు ఆదర్శపాఠశాలగా గుర్తింపు లభించింది. ఈ పాఠశాలలో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఆంగ్ల విద్యాబోధన కొనసాగుతుంది. పాఠశాలలో ప్రస్తుతం 270మంది విద్యార్థులు విద్యనభసిస్తున్నారు.
విశాలమైన పాఠశాల… మెరుగైన విద్యాబోధన..
2015వరకు మనోహరాబాద్ మండల కేంద్రంలో ఇరుకు గదుల్లో, అరకొర వసతులతో కొనసాగేది. కాగా రూ. 42 లక్షల ప్రత్యేక నిధులతో 6నుంచి 10వ తరగతి వరకు జడ్పీహెచ్ఎస్ పాఠశాలను నూతనంగా నిర్మించారు. అన్ని వసతులతో కలిగిన తరగతి గదులు ఉండటంతో విద్యార్థుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. అంతే కాకుండా ప్రైవేటు పాఠశాలను తలదన్నే విధంగా మనోహరాబాద్ జడ్పీహెచ్ఎస్లో ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు మనోహరాబాద్ సర్కారు పాఠశాలలో చేర్పించేందుకు మొగ్గుచూపుతున్నారు.
హరితహారం మొక్కలను దత్తత తీసుకున్న విద్యార్థులు
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన హరితహారం కార్యక్రమాన్ని మనోహరాబాద్ పాఠశాల విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకున్నారు. 6 నుంచి 10వ తరగతి వరకు ఉన్న 270 మంది విద్యార్థులు ప్రతి యేటా మొక్కలను నాటుతుంటారు. అంతేకాకుండా వాటిని తామే స్వయంగా దత్తత తీసుకొని కంటికి రెప్పగా పెంచుతున్నారు. పాఠశాల ఆవరణలో నాటిన మొక్కలకు వారి పేర్లను పెట్టుకొని ప్రతి రోజు నీళ్లు పట్టడం, మొక్క చుట్టూ శుభ్రం చేయడం, పిచ్చిమొక్కలను ఏరివేయడం ఖాళీ సమయాల్లో నిర్వహిస్తుంటారు. ఇప్పటి వరకు 700కు పైగా మొక్కలు ఏపుగా పెరిగి పాఠశాల ఆవరణలో పచ్చదనంతో నిండిపోయింది.
ఆకర్శణీయంగా మనోహరాబాద్ పాఠశాల..
మనోహరాబాద్ పాఠశాల చూడటానికి కార్పొరేట్ స్థాయి పాఠశాలలకు ఏ మాత్రం తక్కువ తీసుపోకుండా ఉంది. చుట్టూ ప్రహరి, విశాలమైన మైదానం.. పచ్చని చెట్లు, మధ్యలో చదువుల తల్లి సరస్వతీదేవి విగ్రహం. పాఠశాలలోకి అడుగుపెట్టగానే దేవాలయంలోకి అడుగుపెట్టామా అన్నట్లు అనిపిస్తుంది. ఇందులో ఉపాధ్యాయుల పాత్ర కీలకం అని చెప్పుకోవాలి. విద్యార్థులను కట్టడి చేస్తూ చదవించకుండా.. స్వేచ్ఛగా.. వారికి అర్థం అయ్యే లా బోధన చేస్తూ పాఠ్యాంశంలో ఏ అనుమానం ఉన్న వెం టనే పరిష్కరిస్తున్నారు. ప్రతి క్షణం విద్యార్థులకు పాఠ్యాంశాల్లో నైపుణ్యాన్ని పెంచి ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దుతున్నారు. ప్రతి యేడు పరీక్షా ఫలితాల్లో వందశాతం ఉత్తీర్ణత సాధిస్తూ జిల్లా స్థాయిలో గుర్తింపు పొందింది.
ప్రతి రంగంలో విద్యార్థుల ప్రతిభ..
మనోహరాబాద్ సర్కారు పాఠశాల విద్యార్థులు ప్రతి రంగంలో తమ ప్రతిభను చాటుతున్నారు. పాఠశాలలో ఉపాన్యాస, వ్యాసరచన, చిత్రలేఖనం, సైన్స్ డే, మ్యాథమెటిక్స్డే, మాక్ పోలింగ్, హరితహారం, స్వచ్ఛత వంటి కార్యక్రమాలపై ప్రత్యేక విద్యాబోధన చేస్తున్నారు. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో జరిగే పలు రంగాల పోటీల్లో విద్యార్థులు తమ ప్రతిభను చాటి ఎన్నో అవార్డులను అందుకున్నారు.
మన ఊరు మన బడితో మరిన్ని సౌకర్యాలు..
2015నుంచి మనోహరాబాద్ పాఠశాలలో ఆంగ్లవిద్య అందుబాటులోకి వచ్చింది. ఇప్పటి వరకు ప్రతియేడు విద్యార్థుల ఉత్తీర్ణత వందశాతం కంటే ఎప్పుడు తగ్గలేదు. సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ శిక్షణ వంటి వాటి కోసం మన ఊరు-మనబడి కార్యక్రమంలో ప్రణాళిక రూపొందించాం. ప్రస్తుతం అవికూడా అందుబాటులోకి రానున్నా యి. వాటితో పాటు పాఠశాలలో ఉన్న చిన్న చిన్న సమస్యలన్నీ తీరనున్నాయి.
– వెంకటస్వామి, ప్రధానోపాధ్యాయుడు