మెదక్ అర్బన్, మార్చి 13: తెల్లవారుజామున, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి, అర్ధరాత్రి.. ఇలా సమయం ఏదైనా కావొచ్చు. బర్త్‌డే, పెండ్లి, దావత్, విషాద ఘటనలు ఇలా సందర్భమేదైనా… ఒక్కరే ఉన్నా, స్నేహితులతో కలిసి ఉన్నా, బంధువులతో ముచ్చటిస్తున్నా, తోటి ఉద్యోగులతో కూర్చున్నా… ముందుగా గుర్తుకొచ్చేది చాయ్! తేనీటి ప్రియులు కోరుకునే రుచులు కూడా భిన్నంగా మారిపోయాయి. చాయ్ ప్రియుల రుచులకు తగ్గట్టుగానే వివిధ పేర్లతో టీస్టాళ్లు వెలుస్తున్నాయి. విభిన్న రుచుల్లో చాయ్ లభిస్తోంది.
చర్చలకు వేదికలుగా…
నగర శివారులలో రోడ్డు పక్కన పార్కింగ్‌కు అనువుగా టీ స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో స్టాల్ వద్ద కనీసం 15 నుంచి 25 వరకు కుర్చీలు వేస్తున్నారు. ఐదారు టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నారు. వచ్చిన టీ ప్రియులకు సౌకర్యవంతంగా ఉండేలా చూస్తున్నారు. అక్కడ 10 నిమిషాలు కూర్చునేందుకు అనువుగా వసతులు కల్పిస్తున్నారు. దీంతో స్నేహితులకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అడ్డాగా మారుతున్నాయి. ప్రయాణాలు చేస్తున్నవారికి ఇవి సౌకర్యవంతంగా ఉంటున్నాయి. అలిసిపోగానే వెంటనే రోడ్డు పక్కన ఆపి టీ తాగేందుకు వీలు కల్పిస్తున్నాయి.
అల్లం నుంచి ధమ్ చాయ్ దాకా..
అల్లం చాయ్, బాదాం టీ, గ్రీన్, లెమన్ టీ, శొంటి టీ, ఇలాచీ టీ, బెల్లం టీ, పెప్పర్ టీ, బ్లాక్ టీ, జింజర్ లెమన్ టీ, బెల్లం పెప్పర్ టీ, మసాలా టీ… అంటూ ఎన్నో విభిన్న రుచుల్లో టీలు ఆయా స్టాళ్లలో అందుబాటులోకి వచ్చాయి. వీటితో పాటు ఆయా ప్రాంచైజీల స్పెషల్ టీలు అదనం. వాతావరణానికి తగ్గట్టు అప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా టీ ప్రియులు సైతం కొత్త రుచులకు మొగ్గు చూపుతున్నారు. ఇక శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయనే ప్రచారంతో అశ్వగంధ టీ, కొరియన్ టీ, జిన్ సెన్ టీ తదితరాలు సైతం అందుబాటులోకి వచ్చాయి. టీ ప్రియుల ఆదరణను పొందుతున్నాయి. వీటితోపాటు టీ స్టాళ్లలో సమోసాలు, బిస్కెట్లు, కర్రీ, ఎగ్ పఫ్‌లు, మిల్క్ షేక్లనూ విక్రయిస్తున్నారు.
తీరొక్క పేరు..
టీ టైం, టీ హౌస్, ఆన్ టీ, డికార్షన్, ధమ్ చాయ్, చాయ్ వాలా, మిస్టర్ టీ, ఏక్‌ధమ్ చాయ్… ఇలా ఎన్నో పేర్లతో మార్కెట్లోకి టీ స్టాళ్లు వచ్చేశాయి. ఒక్కో కంపెనీ ప్రాంఛైజీ ధర దాదాపు రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఉంటుంది. ప్రాంఛైజీ ఇచ్చే కంపెనీ ప్రతినిధులు స్వయంగా వెళ్లి స్టాల్ ఏర్పాటు చేసి ప్రాంతాన్ని పరిశీలిస్తారు. అక్కడ టీ స్టాల్ పెడితే గిరాకీ ఉంటుందా..? అని అరా తీస్తారు. అన్నీ సక్రమంగా ఉంటేనే ప్రాంఛైజీ ఇస్తారు. ప్రాంఛైజీ వారు ఆ పేరున్న బోర్డుతో పాటు స్టవ్, గిన్నెలు, ఫ్రీజర్లు, టీకి సంబంధించిన కొన్ని వస్తువులను అందజేస్తారు.
మంచి గిరాకీ ఉన్నది..
టీ స్టాల్లో మంచి గిరాకీ ఉన్నది. రోడ్డు పక్కనే ఉండటంతో రన్నింగ్ గిరాకీ ఎక్కువగా ఉంటోంది. ప్రతిరోజు దాదాపు 20 నుంచి 25 లీటర్ల పాలు ఉపయోగిస్తాం. దాదాపు 400 చాయ్‌లు విక్రయిస్తాం. వచ్చేవారు కూడా భిన్నమైన రుచులను టేస్ట్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అందుకు తగ్గట్టే మేం ఏర్పాటు చేస్తున్నాం.
– రమేశ్, టీ స్టాల్ నిర్వాహకులు, హవేళీఘనపూర్
స్వయం ఉపాధి దొరికింది..
టీ స్టాల్‌తో స్వయం ఉపాధి దొరికింది. ప్రత్యేకంగా కొత్త టెస్ట్‌తో టీలు ఉన్నాయి. ఇవి అందరికీ నచ్చుతున్నాయి. గిరాకీ బాగుంది. వివిధ రకాల టీలతోపాటు మిల్క్ షేక్‌లను కూడా విక్రయిస్తున్నాం. టీ తాగేవారు రోజురోజుకూ పెరుగుతున్నారు. యువత తమ కాళ్లపై నిలబడేందుకు టీ స్టాళ్లు కూడా ఎంతో దోహదం చేస్తున్నాయి.
– సుమంత్, గోల్డెన్ కేఫ్ టీ స్టాల్ నిర్వాహకుడు