న్యాల్కల్, ఆగస్టు 24: గ్రామ పంచాయతీ ఎన్నికలకు కసరత్తు జరుగుతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త పంచాయతీల ఏర్పాటుకు ఆమోద ముద్ర వేసింది. సం గారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలో నూతనంగా తాట్పల్లి గ్రామాన్ని పంచాయతీగా ఏర్పాటు చేస్తూ శనివారం గెజిట్ ఉత్తర్వులు జారీ చేసింది. మండలంలో ఇప్పటి వరకు 37 గ్రామ పంచాయతీలు ఉండగా తాజాగా వాటి సంఖ్య 38కి చేరి జిల్లాలోనే న్యాల్కల్ అతిపెద్ద మండలంగా అవతరించింది.
2018లో ప్రభుత్వం అనుబంధ గ్రామాలు, తండాలు, గూడాలను పంచాయతీలుగా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయినా కొన్ని అనుబంధ గ్రామాల్లో కొత్త పంచాయతీల ఏర్పాటుకు డిమాండ్లు తెరపైకి వచ్చాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హ యాంలో అనుబంధ గ్రామాల ప్రజల విజ్ఞప్తి మేరకు కొత్త పంచాయతీలు ఏర్పాటు చేయాలని అప్పటి ప్రజాప్రతినిధులు ప్రభుత్వానికి విన్నవించారు. నాటి ప్రతిపాదనల మేరకు మండలంలోని టేకూర్ గ్రామ పంచాయతీ అనుబంధ గ్రామమైన తాట్పల్లిని కొత్త పంచాయతీగా ఏర్పా టు చేస్తూ ప్రభుత్వం తాజాగా ఆమోదం తెలిపింది.
గ్రామ పంచాయతీల పాలక వర్గాల గడువు ఈ సంవత్స రం ఫిబ్రవరి 1వ తేదీతో ముగిసింది. దీంతో గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతున్న పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఇప్పటికే ఓటర్ల జాబితా తయారు చేసే పనిలో నిమగ్నమయ్యారు.
మండలంలోని గ్రామాలకు చెందిన పంచాయతీ కార్యదర్శులు, బీఎల్వోలకు ఓటరు జాబితా రూపకల్పన, వార్డుల విభజన తదితర అంశాలపై సంబంధిత మండల ఎన్నికల అధికారులు శిక్షణ తరగతులు నిర్వహించి అవగాహన కల్పించారు. కొత్తగా ఏర్పడిన తాట్పల్లి గ్రామ పంచాయతీలో కూడా ఎన్నికలు జరుగనున్నాయి. పాత పంచాయతీ టేకూర్ పంచాయతీ పరిధిలోని అనుబంధ గ్రామమైన తాట్పల్లి వేరుపడి పంచాయతీగా మారడంతో అక్కడి వార్డుల పునర్విభజన చేయనున్నారు. పంచాయతీలోని మొత్తం ఓటర్లను ఇంటి నం బర్లతోసహా భౌగోళికంగా వార్డుల విభజన చేయనున్నా రు.
సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లు మార్చుతారా లేక రిజర్వేషన్లను అనుసరించే ఎన్నికలు నిర్వహిస్తారా అనే విషయంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ప్రభుత్వం కొత్త పంచాయతీగా ఏర్పాటు చేయడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. ఒకరినొకరు స్వీట్లు పంచుకుంటూ గ్రామంలో సంబురాలు చేసుకున్నారు. కొత్తగా గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసినందుకు గ్రామ ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రభుత్వానికి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలియజేశారు.
గతంలో ప్రతిపనికి పక్కనే ఉన్న ముంగికి వెళ్లాల్సి వచ్చేది. ఎన్నో ఏండ్ల నుంచి చాలా బాధలు అనుభవించాం. మా ఊరు గ్రా మ పంచాయతీగా ఏర్పడడంతో ఇబ్బందులు తప్పినాయి. గ్రా మాన్ని నూతన పంచాయతీగా ఏర్పాటు చేసేందుకు సహకరించిన ప్రతిఒక్కరికీ రుణపడి ఉంటాం.
– సంగన్న, గ్రామస్తుడు, తాట్పల్లి, సంగారెడ్డి జిల్లా
న్యాల్కల్ మండలంలోని తాట్పల్లి గ్రామాన్ని కొత్త పంచాయ తీ ఏర్పాటుకు సంబంధించిన గెజిట్ ఉత్తర్వులు వచ్చాయి. మండలంలోని గ్రామ పంచాయతీల ఎన్నికల నిర్వహణకు ముందస్తు కసరత్తు జరుగుతున్నది. ఓటరు జాబితా రూపకల్పన, వార్డుల విభజన తదితర అంశాలపై మాస్టర్ ట్రైనర్లు శిక్షణ ఇస్తారు. కొత్తగా ఏర్పడిన పంచాయతీలో ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి చర్యలు తీసుకుంటాం
– సురేశ్, మండల పంచాయతీ అధికారి, న్యాల్కల్, సంగారెడ్డి జిల్లా