కొమురవెల్లి, అక్టోబర్ 27 : సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలంలోని ఐనాపూర్ తాళ్లకుంట చెరువు ఒకప్పుడు 60 ఎకరాలకు ఆయకట్టుకు నీరందించింది. గ్రామస్తులకు ఆదెరువుగా నిలిచింది. అలాం టి చెరువు కబ్జాకోరల్లో చిక్కుకోవడంతో సగం ఆయకట్టుకు నీరందించని పరిస్థితికి చేరింది. చెరువుకు హద్దులు ఏర్పాటు చేసి పరిరక్షించాలని అనేకసార్లు ఇరిగేషన్, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకున్న నాథుడే కరువయ్యారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాళ్లకుంట చెరువులో ఇటీవల మహిళలు బతుకమ్మ నిమజ్జనం చేసేందుకు కూడా చాలా ఇబ్బందులు ఎదురైనట్లు గ్రామస్తులు తెలిపారు.
ఇటీవల గ్రామస్తులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లడంతో తాళ్లకుంట చెరువును ఇరిగేషన్ ఏఈ శశిధర్‌రెడ్డి పరిశీలించారు. త్వరలోనే హద్దులు ఏర్పాటు చేస్తామని గ్రామస్తులకు హామీ ఇచ్చి వెళ్లారు. మరోసారి ఇరిగేషన్ డీఈ శ్యామ్, ఏఈ శశిధర్‌రెడ్డి, గ్రామస్తులతో కలిసిచెరువును పరిశీలించారు. గ్రామానికి వచ్చిన ఇరిగేషన్ డీఈ శ్యామ్‌కు మాజీ సర్పంచ్ చెరుకు రమణారెడ్డి ఆధ్వర్యంలో వినతి పత్రం ఇచ్చారు. చెరువుకు హ ద్దులు ఏర్పాటు చేసి కబ్జాదారుల నుంచి కాపాడాలని కోరారు. చెరువు మరింత అన్యాక్రాం తం కాకముందే చెరువును సర్వేచేసి పరిరక్షించాలని కోరుతున్నారు. త్వరలో చెరువును సర్వే చేసి హద్దు లు ఏర్పాటు చేస్తామని గ్రామస్తులకు ఇరిగేషన్ డీఈ శ్యామ్ హామీ ఇచ్చారు.