సిద్దిపేట, ఏప్రిల్ 1: నిరుపేద విద్యార్థులకు అండగా ఉండేందుకు రూ.100 కోట్లతో పీవీఆర్ ట్రస్టు ఏర్పాటు చేస్తానని మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి, ఎమ్మెల్సీ పి.వెంకట్రామిరెడ్డి అన్నారు. సోమవారం సిద్దిపేట పట్టణంలోని భారత్‌నగర్‌లో జరిగిన నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ యూత్, విద్యార్థి, సోషల్ మీడియా ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా సమస్యలపై పూర్తి అవగాహన ఉన్నదని, ఢిల్లీలో పోరాటం చేసి సమస్యలన్నీ పరిష్కరిస్తానన్నారు. గెలిచిన తొమ్మిది నెలల్లో ఏడు నియోజకవర్గాల్లో ఫంక్షన్‌హాళ్లు నిర్మించి బీఆర్ఎస్ శ్రేణులకు సౌకర్యం కల్పిస్తానన్నారు. 11 ఏండ్లు మెదక్ గడ్డపై పని చేశానని.. ఇది తన అదృష్టమన్నారు.సిద్దిపేట జిల్లాను భారతదేశ పటంలో 10వ స్థానంలో నిలిపిన ఘనత మాజీ సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. ఉద్యోగం హక్కుగా భావించలేదని..
బాధ్యతగా భావించి పనిచేశానని గుర్తుచేశారు. పార్టీకి యువతే సారథులు, వారధులు అని..ఎన్నికల్లో గెలుపు కోసం యువత కీలక పాత్ర పోషించాలన్నారు. సోషల్ మీడియాలో ఏది వాస్తవమో.. అవాస్తవమో తెలియని పరిస్థితి ఏర్పడిందని.. అధికార పార్టీ, కేంద్రంలోని అధికార పార్టీల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నారు. కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమాన్ని.. ప్రస్తుత కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధి తేడాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నాయకులను కోరారు. కార్యక్రమంలో నియోజకవర్గ యువత, విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.