కొల్చారం, మార్చి 22: కొల్చారం, చిలిప్‌చెడ్ మండలాల్లో శుక్రవారం కురిసిన అకాల వర్షం, గాలిదుమారంతో పంటలు దెబ్బతినడం, ఆస్తినష్టం జరగడంపై నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అసెంబ్లీలో మాట్లాడారు. బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. శనివారం సాయంత్రం ఎమ్మెల్యే మండలంలో పర్యటించారు. పోతంశెట్టిపల్లిలోని ఏడుపాయల టీ జంక్షన్ వద్ద కూలిపోయిన హర్షిత రెస్టారెంట్‌తో పాటు దారిపొడవునా గాలికి ఎగిరిపోయిన రెకుల షెడ్లను పరిశీలించి, బాధితులతో మాట్లాడారు.
నష్టపోయిన వారి వివరాలు పక్కాగా నమోదు చేసి ప్రభుత్వానికి నివేదిక పంపాలని తహసీల్దార్‌ను ఆదేశించారు. ఆర్ఐ ప్రభాకర్ బాధితుల వివరాలు నమోదు చేసుకుని పంచనామా నిర్వహించారు. ఎమ్మెల్యే ఘటనా స్థలం నుంచి కలెక్టర్‌తో ఫోన్లో మాట్లాడారు. ప్రభుత్వం తరపున పరిహారం అందేలా కృషి చేయాలని కోరారు. పంచాయతీ కార్యదర్శి అరుంధతి శుక్రవారం తమతో దురుసుగా ప్రవర్తించారని, గాలివానకు రోడ్డుపై కూలిన చెట్లను తొలిగించడానికి జేబీసీ పంపించాలని కోరగా.. తాను ఓట్లేసి ఎన్నుకున్న అధికారిని కాదని సమాధానం ఇచ్చారని పోతంశెట్టిపల్లి గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు.
దీనిపై ఎమ్మెల్యే స్నందించి పంచాయతీ కార్యదర్శికి మెమో ఇవ్వాలని ఎంపీవో కృష్ణవేణిని ఆదేశించారు. అనంతరం విద్యుత్ అధికారులతో ఎమ్మెల్యే మాట్లాడారు. మరమ్మతులు వేగం గా పూర్తిచేసి కరెంట్ సరఫరా పునరుద్ధరించాలని కోరారు. ఎమ్మెల్యే వెంట బీఆర్ఎస్ నాయకులు గౌరీశంకర్ గుప్తా, నరేందర్ రెడ్డి, ముత్యంగారి సంతోష్‌కుమార్, తునుకులపల్లి సంతోష్, కొమ్ముల యాదాగౌడ్, కరెంటు రాజాగౌడ్, రెవెన్యూ అధికారులు, విద్యుత్ అధికారులు పాల్గొన్నారు.