నర్సాపూర్, ఏప్రిల్ 9:రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకొంటున్నదని, సన్నిబియ్యంలో 30శాతం నూకలే ఉంటున్నాయని, నాసిరకం బియ్యం పం పిణీ చేస్తున్నారని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. బుధవారం నర్సాపూర్‌లోని తన క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి మీడియాతో మాట్లాడారు. రేషన్ దుకాణాల్లో కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం దారు ణం అన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీలను నియోజకవర్గంలోని ప్రతి రేషన్ దుకాణానికి పంపించి, వాటిని కచ్చితంగా పెట్టాలని, లేకపోతే మీ సంగతి చూస్తామని రేషన్ డీలర్లను కాంగ్రెస్ నాయకులు బెదిరిస్తున్నారని ఆరోపించారు.
ఒకవేళ అధికారికంగా నిర్వహిస్తే ప్రొటోకాల్ ప్రకారం ఫ్లెక్సీ ల్లో సీఎం, మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యే, కలెక్టర్ల ఫొటోలు ఉండాలని సునీతాలక్ష్మారెడ్డి గుర్తుచేశారు. ఇలా కాకుండా కేవలం కాంగ్రెస్ నాయకుల ఫొటోలతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులు ప్రతి గ్రామానికి వెళ్లి పార్టీ కార్యక్రమం మాదిరిగా బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నారని, ఈ విషయంపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లామని, తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రేషన్ దుకాణాల్లో పార్టీ ఫ్లెక్సీలు ఎందుకు పెట్టారని ప్రజలు ప్రశ్నిస్తే వారికి రేషన్ బియ్యం పంపిణీ చేయకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
ప్రజలంతా గమనిస్తున్నారని, సరైన సమయంలో గుణపాఠం చెబుతారని ఆమె అన్నారు. రేషన్ దుకాణాలను కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలుగా మార్చారని ధ్వజమెత్తారు. వరి కోతలు మొదలైన దృష్ట్యా వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజాపాలనలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు తీసుకుని ఇప్పటి వరకు ఇవ్వలేదన్నారు. రైస్‌మిల్లర్లను అలర్ట్ చేసి వచ్చిన ధాన్యం వచ్చినట్లు రైస్‌మిల్లులకు తరలించాలని సూచించారు.
గత పంటకు సంబంధించిన సుమా రు రూ.7 కోట్ల బోనస్ డబ్బులు రైతుల ఖాతాలో వేయాలని, ప్రస్తుత పంటకు మద్దతు ధర కల్పిస్తూ బోనస్ పూర్తిగా అందజేయాలని ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేశారు. ఆరు గ్యారెంటీలు అమలు చేయాలన్నారు. రైతుభరోసా చాలామంది రైతులకు అందలేదని, తక్షణమే అందించాలని ప్రభుత్వాన్ని సునీతాలక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ అశోక్‌గౌడ్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు భిక్షపతి, బీఆర్ఎస్ నాయకులు ఆంజనేయులుగౌడ్, రింగుల ప్రసాద్ పాల్గొన్నారు.