వెల్దుర్తి, ఏప్రిల్ 3 : కాంగ్రెస్ నాయకులు అభివృద్ధి నిరోధకులుగా మారారని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి విమర్శించారు. గురువారం మాసాయిపేటలో ఆమె మీడియాతో మాట్లాడారు. తాను నియోజకవర్గ అభివృద్ధి కోసం కలిసిపోయి పనిచేస్తుంటే, కాంగ్రెస్ నాయకులు గొప్పలకు పోతూ అభివృద్ధిని, పథకాల పంఫిణీ అడ్డుకుంటూ, నెలల తరబడి కాలయాపన చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. గురువారం మాసాయిపేటలో సన్నబియ్యంతో పాటు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడానికి వచ్చానని, ఈ విషయమై లబ్ధ్దిదారులకు సైతం సమాచారం ఇచ్చామన్నారు.
కానీ, కాంగ్రెస్ నాయకులు, అధికారులు కలిసి కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీని మంత్రి వచ్చి పంపిణీ చేస్తారని, సన్నబియ్యం పంపిణీ మాత్రం చేయాలని అడ్డుకున్నట్లు తెలిపారు. తాను ఎన్నికైన నాటి నుంచి నేటి వరకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీని అడ్డుకోవడానికి కాంగ్రెస్ నాయకులు అధికారులతో ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. మంత్రి వచ్చి పంపిణీ చేస్తారంటూ నెలల తరబడి వాటిని నిలిపి వేస్తున్నారని, దీంతో చెక్కుల గడువు ముగియడంతో మళ్లీ కొత్త చెక్కులు తెస్తూ లబ్ధ్దిదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.
జిల్లాలోని వేరే నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు పంపిణీ చేస్తున్నారని, ఇక్కడ మాత్రం కాంగ్రెస్ నాయకులు, అధికారులు అడ్డుకోవడం ఎంతవరకు సమంజసం సునీతాలక్ష్మారెడ్డి ప్రశ్నించారు. తాను ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యేను అని, గతంలో మంత్రిగా పనిచేశానని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలోనూ ఇలాగే వెల్దుర్తి, మాసాయిపేట, మనోహరాబాద్‌లో చెక్కుల పంపిణీ నిలిపివేశారని, కొల్చారం, చిలిప్‌చెడ్ మండలాల తహసీల్దార్లు కల్యాణలక్ష్మి పంపిణీకి తనును ఆహ్వానించి, తీరా మంత్రి ఇస్తారంటూ వాయిదా వేసిన విషయాన్ని గుర్తుచేశారు.
మంత్రులు వస్తే సంతోషం అని, వారు తీరిక లేకుండా ఉంటున్న సమయంలో జాప్యం చేస్తూ లబ్ధ్దిదారులను ఎందుకు నష్టపరుస్తున్నారని సునీతాలక్ష్మారెడ్డి ప్రశ్నించారు. అధికారులు సైతం ప్రొటోకాల్ విస్మరిస్తున్నారని ఆమె మండిపడ్డారు. ఎమ్మెల్యేగా తన హక్కులను కాలరాస్తామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. నర్సాపూర్ మున్సిపాలిటీలో అమృత్ పథకం నిధులతో చేపట్టే పనులు, సికింద్లాపూర్, మహ్మద్‌నగర్, చండూర్లో సబ్స్టేషన్ల నిర్మాణానికి మంత్రి వచ్చి శంకుస్థాపన చేస్తారని నిలిపివేశారని సునీతాలక్ష్మారెడ్డి ఆరోపించారు.
తండాలకు బీటీ రోడ్లు వేయడానికి కేసీఆర్ రూ. 158 కోట్ల నిధులను ఇస్తే, అందులో నుంచి 24 తండాలకు చెందిన రూ.48 కోట్ల నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దుచేసిందని, ఆ నిధులు తెచ్చి మాట్లాడాలని కాంగ్రెస్ నాయకులకు ఆమె హితవు పలికారు. సమావేశంలో మాసాయిపేట, వెల్దుర్తి, శివ్వంపేట మండలాల బీఆర్ఎస్ అధ్యక్షులు మధుసూదన్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి, రమణగౌడ్, నాయకులు నాగరాజు, నర్సింలు, స్టేషన్శ్రీను, నర్సింహారెడ్డి, హారిక్రిష్ణ, బాలేష్, శంకర్, శ్రీను, లింగం, మోహన్‌రెడ్డి, అర్జున్ తదితరులు పాల్గొన్నారు.