నర్సాపూర్, మార్చి 17 : సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం ప్యారానగర్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న డంపింగ్ యార్డును తక్షణమే నిలిపివేయాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి సోమవారం అసెంబ్లీలో ప్రస్తావించారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. డంపింగ్ యార్డు ఏర్పాటుతో మూడు మండలాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని వెల్లడించారు.
డంపింగ్ యార్డుకు సేకరించిన 152 ఎకరాల భూమి గ్యాప్ ల్యాండ్ అంటూ ప్రభుత్వం చెబుతున్నదని, అది గ్యాప్ ల్యాండ్ కాదని.. నల్లవల్లి, కొత్తపల్లి గ్రామాలకు సంబంధించిన అటవీ భూమని పేర్కొన్నారు. ఈ భూమిని వెంటనే సర్వే చేయించాలని ప్రభుత్వాన్ని ఆమె కోరారు. డంపింగ్ యార్డు నిర్మాణంపై ఇప్పటికే కోర్టు స్టే ఇచ్చిందని సభాముఖంగా గుర్తుచేశారు. ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ప్రశ్నకు మంత్రి పొన్నం ప్రభాకర్ సమాధానమిస్తూ డంపింగ్ యార్డు అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు. డంపింగ్ యార్డు అంశంపై అసెంబ్లీలో చర్చించినందుకు గుమ్మడిదల, నర్సాపూర్ మండల ప్రజలు, ప్రజాప్రతినిధులు, నాయకులు ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.